Revanth Reddy: నాపై అనవసరంగా విమర్శలు చేయొద్దు: రేవంత్ రెడ్డి

Revanth talks to media

  • ముగిసిన కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం
  • మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి
  • తనపై దుష్ప్రచారం జరుగుతోందని వెల్లడి
  • చిన్న సమస్యలను పెద్దవిగా చూడొద్దంటూ హితవు

టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్ లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ముగిసింది. హాత్ మే హాత్ జోడో కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి 9 మంది సీనియర్లు దూరంగా ఉన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజనర్సింహ, మధుయాష్కీ గౌడ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోదండరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. 

ఈ సమావేశం ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలతోనే ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు. భారత్ జోడో యాత్రపై సమావేశంలో చర్చించామని తెలిపారు. ఈ నెల 20 నుంచి 24 వరకు అన్ని జిల్లాల్లో సమీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. మోదీ, కేసీఆర్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతాం అని పేర్కొన్నారు.

ఇక పార్టీ సీనియర్లపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని ఉత్తమ్ కుమార్ అనడంపైనా రేవంత్ స్పందించారు. ఉత్తమ్ కుమార్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని సీపీ సీవీ ఆనంద్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. సీపీ ఆనంద్ ఐపీఎస్ అధికారా లేక ఒక పార్టీకి కార్యకర్తా అని ప్రశ్నించారు. 

సొంత పార్టీ నేతలపైనే ఎవరైనా వ్యతిరేక పోస్టులు పెడతారా అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. తీన్మార్ మల్లన్న ఎవరో తనకు తెలియదని స్పష్టం చేశారు. తీన్మార్ మల్లన్న ఎవరినో తిడితే నాకేంటి సంబంధం? అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"ఎవరైనా తిడితే వారిని చెప్పు తీసుకుని కొట్టండి... అంతే తప్ప నాపై అనవసరంగా విమర్శలు చేయవద్దు... సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టులను నాకు అంటగట్టవద్దు. పార్టీ అధికారంలోకి రావాలని టీపీసీసీ చీఫ్ గా కృషి చేసే నేను మా పార్టీ నేతలపైనే వ్యతిరేక పోస్టులు ఎలా పెడతాను?" అని ప్రశ్నించారు. 

కావాలనే తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నాపై ఉన్న అపోహలు తీసేయండి... నమ్మకంతో పనిచేయండి అని హితవు పలికారు. పార్టీలో ఎవరికైనా సమస్యలు ఉంటే అధిష్ఠానం పరిష్కరిస్తుందని అన్నారు. చిన్న సమస్యలను కూడా పెద్దవిగా చూడొద్దని, ప్రజా సమస్యలతో పోల్చుకుంటే పార్టీలో సమస్యలు పెద్దవేం కాదని తెలిపారు.

Revanth Reddy
Congress
TPCC
Telangana
  • Loading...

More Telugu News