- ఓ సరసు ఒడ్డున ఆడుకుంటున్న బాలుడు
- నీటి నుంచి బయటకు వచ్చి నోటితో పట్టుకుని మింగేసిన హిప్పో
- ఓ వ్యక్తి రాళ్లు విసరడంతో బయటకు ఉమ్మేసిన నీటి ఏనుగు
ఉగాండాలో నమ్మలేని ఘటన జరిగింది. ఓ హిప్పో పోటమస్ (నీటి ఏనుగు) రెండేళ్ల బాలుడ్ని మింగింది. అదృష్టవశాత్తూ తిరిగి ఆ బాలుడు హిప్పో నోటి నుంచి బయటపడ్డాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను యూకే టెలిగ్రాఫ్ అనే మీడియా సంస్థ వెలుగులోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పాల్ ఇగా అనే బాలుడు తన ఇంటి బయట ఆడుకుంటున్నాడు. అతడి ఇల్లు కట్వే ప్రాంతంలోని ఎడ్వర్డ్ సరస్సుకు 800 మీటర్ల దూరంలో ఉంది. ఉన్నట్టుండి నీటి నుంచి బయటకు వచ్చిన హిప్పో బాలుడ్ని నోట కరుచుకుని మింగేసింది. దీన్ని అక్కడికి సమీపంలోనే ఉన్న క్రిస్ పాస్ బగంజా అనే వ్యక్తి చూశాడు. వెంటనే రాళ్లు తీసుకుని హిప్పోపై విసరడం మొదలు పెట్టాడు. దీంతో అది మింగేసిన బాలుడ్ని బయటకు ఉమ్మేసింది. ఇదంతా నిమిషం వ్యవధిలోపే జరిగిపోవడంతో, బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
అనంతరం బాలుడ్ని సమీపంలోని క్లినిక్ కు తరలించారు. అతడికి కొన్ని గాయాలు కావడంతో చికిత్స చేసి, ఎందుకైనా మంచిదని ర్యాబిస్ టీకా ఇచ్చి పంపించారు. హిప్పో మాత్రం తిరిగి సరస్సులోకి వెళ్లిపోయింది.