Hyderabad: హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసం వద్ద సెక్యూరిటీ ఆడిట్.. ఓ మార్గాన్ని సగం తెరిచే యోచన!

ISW Officers Audit  at Chandrababu House in Hyderabad
  • నగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు దారి మళ్లిస్తున్న పోలీసులు
  • రోడ్డు నంబరు 45 నుంచి వచ్చే వాహనాలను రోడ్డు నంబరు 1కి మళ్లించే యోచన
  • చంద్రబాబు ముఖ్య భద్రతాధికారితో మాట్లాడిన ఐఎస్‌డబ్ల్యూ అధికారులు
హైదరాబాద్‌లోని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇంటి వద్ద నిన్న సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రయత్నంలో భాగంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. అందులో భాగంగా బంజారాహిల్స్-జూబ్లీహిల్స్ కారిడార్‌లోనూ ట్రాఫిక్‌ను మళ్లించారు. ఈ క్రమంలో చంద్రబాబు నివాసానికి వెళ్లే మూడు దారులను తెరిస్తే ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించవచ్చని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు.

ఇందులో భాగంగా తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యూ) డీఎస్పీ శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ ఐఎస్‌డబ్ల్యూ డీఎస్పీ రవీందర్‌రెడ్డితోపాటు పలువురు ట్రాఫిక్, అగ్నిమాపక శాఖ అధికారులు నిన్న చంద్రబాబు ఇంటికి చేరుకుని పరిశీలించారు. చంద్రబాబు ముఖ్య భద్రతాధికారి మధుసూదన్‌తో మాట్లాడారు.

రోడ్డు నంబరు 1 నుంచి రోడ్డు నంబరు 65తో పాటు రోడ్డు నంబరు 36లో హెరిటేజ్ పక్క నుంచి, రోడ్డు నంబరు 45 మీదుగా హెచ్‌పీ గ్యాస్ పక్క నుంచి చంద్రబాబు నివాసానికి చేరుకోవచ్చు. కాబట్టి రోడ్డు నంబరు 45 నుంచి వచ్చే వాహనాలను గ్యాస్ ఏజెన్సీ పక్కనున్న సందులోంచి రోడ్డు నంబరు 1కి మళ్లించాలని భావిస్తున్నారు. అలాగే చంద్రబాబు నివాసం వద్ద మూసేసిన మొత్తం దారిలో సగం తెరిచి రాకపోకలకు అనుమతించాలని అధికారులు యోచిస్తున్నారు.
Hyderabad
Chandrababu
Traffic Police
ISW

More Telugu News