- ఏప్రిల్ నుంచి 2.25 శాతం మేర పెరిగిన రెపో రేటు
- దీంతో గృహ రుణాలపై 25 శాతం పెరిగిన రేటు
- భవిష్యత్తులో రేట్లు పెరిగే అవకాశాలే ఎక్కువ
పెరిగిపోయిన నిత్యావసరాల ధరలు, గరిష్ఠాల్లో ఉన్న పెట్రోలియం ధరలు, వ్యవస్థలో అదనపు నగదు లభ్యత.. వీటన్నింటి మధ్య సమతూకంగా ఆర్ బీఐ వరుసగా రేట్లను పెంచుతూ వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 2.25 శాతం మేర రెపో రేటును పెంచింది. దీంతో రుణాలు భారంగా మారాయని చెప్పుకోవచ్చు. గత ఏప్రిల్ వరకు గృహ రుణాలపై ప్రారంభ రేటు 6.5 శాతంగా ఉంటే అది ఈ ఎనిమిది నెలల్లో పావు శాతం పెరిగి 9 శాతానికి చేరుకుంది.
ఈ ఏడాది ఏప్రిల్ కు ముందు ఫిక్స్ డ్ రేటుపై వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారిపై రేట్ల పెంపు వల్ల అదనంగా ఎలాంటి భారం పడదు. కానీ, గృహ రుణాలన్నవి ఫ్లోటింగ్ రేటుపైనే ఉంటాయి. దీంతో రేట్ల పెరుగుదల ప్రభావం గృహ రుణ గ్రహీతలపై అధికంగానే పడింది. వారు నెలవారీగా పావు శాతం అధికంగా ఈఎంఐ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గృహ రుణం కాకుండా, ఫ్లోటింగ్ రేటుపై తీసుకున్న ఇతర రుణాలపైనా రెపో రేటు పెరుగుదల ప్రభావం ఉంటుందని తెలుసుకోవాలి.
వడ్డీ రేట్ల పెరుగుదల ఇంతటితో ముగిసిందని చెప్పడానికి లేదు. రానున్న నెలల్లోనూ ఆర్ బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) రేట్లను పెంచే అవకాశాలే ఉన్నాయి. కనుక భవిష్యత్తులో రుణాల ఈఎంఐలు మరింత పెరగనున్నాయి. అయితే, ఇప్పటి వరకు పెరిగిన రేట్ల మేర ఈఎంఐ పెరగకుండా, రుణ కాలవ్యవధిని పెంచుకునే ఆప్షన్ ను బ్యాంకులు కల్పించాయి. కానీ, ఇకపై రేట్లు ఇంకా పెరిగితే కాల వ్యవధి కాకుండా, ఈఎంఐని సవరించేందుకు బ్యాంకులు మొగ్గు చూపించొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక ఇప్పటి వరకు పెరిగిన రేట్ల వల్ల ఎవరిపై ఎక్కువ భారం పడుతుందని గమనించినట్టయితే.. మిగిలిన రుణ కాల వ్యవధిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు రూ.30 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి ఈ ఏడాది మార్చిలో తీసుకున్నారని అనుకుందాం. దీనివల్ల ఈఎంఐ రూ.23,258 నుంచి రూ.27,387కు పెరిగింది. అంటే 17.75 శాతం పెరిగినట్టు. ఒకవేళ గృహ రుణాన్ని 30 ఏళ్లకు తీసుకుని ఉంటే అప్పుడు ఈఎంఐ 23 శాతం పెరిగి ఉండేది.