- బాలీవుడ్ లో వివక్షను ప్రస్తావించిన ప్రియాంక
- షూటింగ్ సెట్లోనూ తమకు స్వేచ్ఛ ఉండేది కాదన్న నటి
- సమానంగా చెల్లించాలని అడిగినా ప్రయోజనం లేదని వెల్లడి
బాలీవుడ్ లో హీరోయిన్ల పారితోషికాలపై నటి ప్రియాంక చోప్రా గళం విప్పింది. కెరీర్ ఆరంభంలో హీరోల రెమ్యునరేషన్ తో పోలిస్తే కేవలం 10 శాతమే తనకు చెల్లించినట్టు ఆమె పేర్కొంది. బీబీసీ 100 వుమెన్ లో చోటు సంపాదించుకున్న నలుగురు భారతీయ మహిళల్లో ప్రియాంక ఒకరని తెలిసిందే.
ఓ సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ప్రియాంక చోప్రా బాలీవుడ్ పరిశ్రమలో పారితోషికం చెల్లింపుల్లో అసమానతలను ప్రస్తావించారు. ‘‘బాలీవుడ్ లో నాకు సమానంగా ఎప్పుడూ చెల్లించలేదు. తోటి పురుష నటులకు ఇచ్చిన దానితో పోలిస్తే నాకు 10 శాతమే చెల్లించే వారు. ఇది చాలా వ్యత్యాసం. చాలా మంది మహిళా నటులు ఇప్పటికీ దీన్ని ఎదుర్కొంటూనే ఉన్నారు. నేను ఇప్పుడు బాలీవుడ్ లో నటించినా నాకు కూడా ఇదే విధంగా చెల్లిస్తారు. మా తరం మహిళా నటులు సమాంతర చెల్లింపుల గురించి అడిగినా ఉపయోగం లేదు’’ అని తెలిపింది.
షూటింగ్ సెట్ల వద్ద మహిళా నటుల పట్ల వివక్షను సైతం ప్రియాంక ప్రస్తావించారు. ‘‘సెట్లో గంటల తరబడి కూర్చోవడం సరైనదే అనుకున్నాను. కానీ, నా తోటి పురుష నటులు మాత్రం స్వేచ్ఛగా వ్యవహరించేవారు. వారు అనుకున్నప్పుడే షూటింగ్ కు వచ్చేవారు’’ అని ప్రియాంక వివరించింది.