Sex Racket: 14 వేల మంది అమ్మాయిలతో ఇంటర్నేషనల్ సెక్స్ రాకెట్... గుట్టురట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు

Cyberabad police busted huge online sex racket

  • అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ను భగ్నం చేసిన పోలీసులు
  • వ్యభిచారం కూపంలో 1,419 మంది అమ్మాయిలు
  • ఒక్క హైదరాబాదులోనే 950 మంది అమ్మాయిలతో వ్యభిచారం
  • 17 మందితో కూడిన ముఠా అరెస్ట్

సైబరాబాద్ పోలీస్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేసింది. ఈ వ్యభిచార దందాలో 14,190 మంది అమ్మాయిలు చిక్కుకున్నట్టు గుర్తించారు. పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలు, ఉద్యోగాల కోసం వెతుకుతున్న అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి దించేవారని పోలీసులు తెలిపారు. వాట్సాప్ గ్రూపులు, వెబ్ సైట్, కాల్ సెంటర్లు, వాణిజ్య ప్రకటనల ద్వారా విటులను ఆకర్షించేవారని వివరించారు. 

ఒక్క హైదరాబాదులోనే 950 మంది అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. 17 మందితో కూడిన ఈ ముఠాను అరెస్ట్ చేశామని చెప్పారు. నిందితుల నుంచి 3 కార్లు, 34 సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, రెండున్నర గ్రాముల ఎండీఎంఏ మత్తుపదార్థం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 

ఈ కేసులో అర్ణవ్ అనే వ్యక్తి కీలక నిందితుడని, అతడిని సోమాజిగూడలో అరెస్ట్ చేశామని వెల్లడించారు.  ఏపీలో అనంతపురం నుంచి, తెలంగాణలో కరీంనగర్ నుంచి ఈ దందా నడిపిస్తున్నారని వివరించారు. 

తెలుగు రాష్ట్రాలు, ముంబయి, ఢిల్లీ, కోల్ కతాకు చెందిన అమ్మాయిలే  కాకుండా... రష్యా, బంగ్లాదేశ్, నేపాల్, ఉజ్బెకిస్థాన్, థాయ్ లాండ్ కు చెందిన అమ్మాయిలతోనూ వ్యభిచారం నిర్వహిస్తున్నారని సీపీ తెలిపారు. అంతేకాదు, విటులకు డ్రగ్స్ కూడా సరఫరా చేసేవారని  వెల్లడించారు. 

ఇలాంటి వ్యవహారాల్లో మహిళలు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం అనుమానాస్పదంగా కనిపించినా 100 నెంబరుకు డయల్ చేయాలని, లేదా, 9490617444 నెంబరుకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని సీపీ వెల్లడించారు.

Sex Racket
Hyderabad
Online
International
Telangana
Andhra Pradesh
  • Loading...

More Telugu News