Chandrababu: అఖిలపక్ష సమావేశంలో డిజిటల్ నాలెడ్జ్ అంశంపై మాట్లాడిన చంద్రబాబు
- భారత్ కు జీ-20 అధ్యక్ష బాధ్యతలు
- ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం
- రెండు గంటలకు పైగా సాగిన భేటీ
- పలు సూచనలు చేసిన చంద్రబాబు
జీ-20 సమావేశం సన్నాహకాల్లో భాగంగా నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. ఈ భేటీ రెండు గంటలకు పైగా సాగింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఈ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబునాయుడు ప్రధానంగా డిజిటల్ నాలెడ్జ్ అంశంపై మాట్లాడారు.
దేశ ప్రగతిపై వచ్చే 25 ఏళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించారు. రాబోయే పాతికేళ్లలో భారత్ మొదటి, లేదా రెండో స్థానానికి చేరడం ఖాయమని తెలిపారు.
మన దేశానికి ఉన్న ప్రధాన బలం యువశక్తి అని తెలిపారు. వారికి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వాలు తమ పాలసీలను రూపొందించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశానికి ఉన్న మానవ వనరులు శక్తిని, నాలెడ్జ్ ఎకానమీకి అనుసంధానిస్తే అద్భుతమైన ఫలితాలు అందుకోవచ్చని చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. కాగా, చంద్రబాబు పేర్కొన్న డిజిటల్ నాలెడ్జ్ అంశాన్ని ప్రధాని మోదీ కూడా ప్రస్తావించారు.
ఈ సమావేశం నేపథ్యంలో మోదీతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. పలు అంశాలపై ఇరువురు చర్చించుకోవడం కనిపించింది. చంద్రబాబు చెప్పిన విషయాలను మోదీ ఆసక్తిగా విన్నారు.