dust allergy: డస్ట్ అలర్జీకి ఆయుర్వేదం చెబుతున్న సహజ పరిష్కారాలు
- సీజనల్ వారీగా రకరకాల అలెర్జీ సమస్యలు
- శీతాకాలంలో డస్ట్ అలెర్జీ ఎక్కువ
- పసుపు, తులసి, కలోంజీతో మంచి ఉపశమనం
నేడు పట్టణాలనే కాదు, పల్లెల్లోనూ కాలుష్యం పెరిగింది. వాయు కాలుష్యంలోనూ ఎన్నో రకాలున్నాయి. అందులో దుమ్ము ఒకటి. సీజనల్ వారీగా ఈ కాలుష్యంతో పలు రకాల అలర్జీలు వస్తుంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో దుమ్ము, ధూళి కాలుష్యం భూ ఉపరితలంపై మరీ ఎత్తుకు వెళ్లదు. దీంతో కాలుష్యం పెరిగి ఎన్నో సమస్యలు వస్తుంటాయి.
సాధారణంగా ఈ అలర్జీ కారకాలకు ముందుగా స్పందించేవి మన ముక్కు, గొంతు అని చెప్పుకోవాలి. ఇవి మన వ్యాధి నిరోధక రక్షణ వ్యవస్థలో ప్రాథమికంగా స్పందించే భాగాలు. అందుకే ముక్కు కారడం, తుమ్ములు, దగ్గు, కళ్లు ఎర్రబడడం, గొంతు మంట, నొప్పి కనిపిస్తాయి. ఈ సమస్యలకు ఆయుర్వేద వైద్యులు సహజసిద్ధ పరిష్కారాలు సూచిస్తున్నారు.
పసుపు
ఇది సహజసిద్ధమైన యాంటీ బయోటిక్. దగ్గును తగ్గించే శక్తి దీనికి ఉంది. అంతే కాదు, ఇన్ ఫ్లమేషన్, కళ్లెను సైతం తగ్గిస్తుంది. రాత్రి నిద్రకు ముందు గోరువెచ్చని పాలలో పసుపు వేసుకుని తాగాలి.
తులసి
తులసిలో యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. శ్వాస కోస సమస్యలకు తులసి మంచి ఔషధమని మన పెద్దలు కూడా సూచిస్తుంటారు. దగ్గు వస్తుంటే ఎండబెట్టిన తులసి ఆకుల పొడిని తేనెతో కలిపి తీసుకోవచ్చు. అప్పుడే కోసిన తులసి ఆకులను పుక్కిట పెట్టుకుని కొంచెం కొంచెం నమిలి రసం మింగడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే తులసి ఆకులను నీటిలో కాచి తాగడం వల్ల కూడా ఫలితం ఉంటుంది.
బ్లాక్ కుమిన్
దీన్ని కలోంజీ అని అంటారు. దీనిలో యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్, ఇన్ ఫ్లమేషన్ తగ్గించే ఔషధ గుణాలు కలోంజీకి ఉన్నాయి. నల్లగా, నువ్వుల మాదిరి ఇవి కనిపిస్తాయి. అలెర్జిక్ రైనైటిస్ సమస్యలో కలోంజీ నూనెను ముక్కుపై, గొంతుపై రాసుకోవడం వల్ల ఉశమనం ఉంటుంది.
యోగ
ప్రాణాయామంతో వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది. దీనివల్ల అలెర్జీలపై పైచేయి సాధించొచ్చు. అర్ధ చంద్రాసన, పవన ముక్తాసన, వృక్షాసన, సేతు భద్రాసనాలు ఇందుకు పరిష్కారాలు.