Hyderabad central university: హిందీ నేర్పిస్తానని చెప్పి ఇంటికి తీసుకెళ్లి.. అసభ్యంగా ప్రవర్తించారు: సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ పై బాధితురాలు ఆరోపణ

professor rape attempt on thailand student in HCU
  • ఇంట్లో మద్యం ఆఫర్ చేసి అసభ్యంగా ప్రవర్తించిన రవిరంజన్
  • ప్రతిఘటించడంతో తనపై దాడి చేశాడని బాధితురాలి వివరణ
  • తన కారులోనే యూనివర్శిటీ గేటు ముందు దింపాడని వెల్లడి
  • ప్రొఫెసర్ రవిరంజన్ పై ఇప్పటికే పలు ఆరోపణలు
సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. థాయ్ లాండ్ నుంచి ఇటీవలే వచ్చిన విద్యార్థినికి హిందీ నేర్పిస్తానంటూ ప్రొఫెసర్ రవిరంజన్ నమ్మించాడు. బేసిక్స్ నేర్పించే బుక్ కోసం ఇంటికి రమ్మంటూ బాధితురాలిని తన కారులోనే తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లాక అసభ్యంగా ప్రవర్తించాడని థాయ్ లాండ్ విద్యార్థిని పోలీసులకు తెలిపింది. మద్యం ఆఫర్ చేసి అసభ్యంగా తాకడంతో తాను ప్రతిఘటించానని పేర్కొంది. దీంతో ప్రొఫెసర్ తనపై దాడి చేశాడని, ఆపై తన కారులోనే తీసుకొచ్చి యూనివర్శిటీ గేటు ముందు వదిలివెళ్లాడని పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కొంది.

థాయ్ లాండ్ నుంచి ఇటీవలే వచ్చి సెంట్రల్ యూనివర్శిటీలో చేరిన విద్యార్థిని శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో క్యాంపస్ నుంచి బయటకు వచ్చినట్లు పోలీసులు చెప్పారు. అక్కడికి వచ్చిన ప్రొఫెసర్ రవిరంజన్ హిందీ నేర్పిస్తానని, బేసిక్స్ పుస్తకం కోసం తన ఇంటికి రమ్మని పిలవడంతో కారులో వెళ్లిందని చెప్పారు. ప్రొఫెసర్ ఇంట్లో మద్యం ఆఫర్ చేసి, తాగాక అత్యాచారయత్నం చేశాడన్నారు. ప్రొఫెసర్ రవిరంజన్ ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధిత విద్యార్థినిని వైద్య పరీక్షలకు పంపించినట్లు వివరించారు. మరోవైపు, ప్రొఫెసర్ రవిరంజన్ ను సస్పెండ్ చేసినట్లు యూనివర్శిటీ అధికారులు తెలిపారు.

ఇప్పటికే రెండు కేసులు..
ప్రొఫెసర్ రవిరంజన్ ఇప్పటికే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నట్లు యూనివర్శిటీ విద్యార్థులు చెబుతున్నారు. క్యాంపస్ లోపల ఎలాంటి ఘటనలు జరిగినా విచారించేందుకు వర్శిటీ తరఫున ఒక కమిటీ ఉందన్నారు. ప్రొఫెసర్ రవి రంజన్ వేధింపులకు సంబంధించి ఇప్పటికే రెండు కేసులను కమిటీ విచారిస్తోందని తెలిపారు. ఆ కేసులలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ఇప్పుడు ఈ ఘటనకు అవకాశం కల్పించినట్టయిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రొఫెసర్ రవిరంజన్ ను శాశ్వతంగా వర్శిటీ నుంచి పంపేయాలనే డిమాండ్ తో క్యాంపస్ లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.
Hyderabad central university
Thailand
student
professor
rape attempt

More Telugu News