Amararaja Group: తెలంగాణలో ఈవీ బ్యాటరీ యూనిట్ ఏర్పాటు చేయనున్న అమరరాజా గ్రూప్
- తెలంగాణలో అమరరాజా పెట్టుబడులు
- లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు
- తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం
- సంతోషం వ్యక్తం చేసిన గల్లా జయదేవ్
- వచ్చే ఐదేళ్లలో మరిన్ని పెట్టుబడులు పెడతామని వెల్లడి
- ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్
ఏపీకి చెందిన అమరరాజా గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులు పెడుతోంది. అమరరాజా సంస్థ తెలంగాణలో ఈవీ బ్యాటరీల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు అమరరాజా గ్రూప్, తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీనిపై ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు.
తమ కుటుంబానికి చెందిన అమరరాజా గ్రూప్ తెలంగాణలో యూనిట్ ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషిస్తున్నామని తెలిపారు. నూతన టెక్నాలజీతో ఈవీ బ్యాటరీల తయారీ యూనిట్ ను నెలకొల్పుతున్నట్టు వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతికి పెద్దపీట వేస్తోందని గల్లా జయదేవ్ కొనియాడారు. వచ్చే ఐదేళ్లలో తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెడతామని వివరించారు. దేశంలోని టైర్-2, టైర్-3 నగరాల్లో అమరరాజా గ్రూప్ పెట్టుబడులకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఎక్కడ తమ పరిశ్రమ ఏర్పాటు చేసినా స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తామని గల్లా జయదేవ్ స్పష్టం చేశారు.
కాగా, అమరరాజాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నందుకు అమరరాజా గ్రూప్ నకు ధన్యవాదాలు తెలిపారు. భారత్ లో అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీ రంగంలో ఇదే అతిపెద్ద పెట్టుబడి అని పేర్కొన్నారు.