Ukraine: ఉక్రెయిన్, రష్యా ఇప్పటి వరకు ఎంత మంది సైనికులను కోల్పోయాయంటే..!

Ukraine lost 13000 soldiers in war against Russia
  • నెలలు గడుస్తున్నా కొనసాగుతున్న యుద్ధం
  • 13 వేల మంది వరకు తమ సైనికులు చనిపోయారన్న ఉక్రెయిన్
  • లక్ష మంది సైనికులను రష్యా కోల్పోయిందన్న అమెరికా ఆర్మీ అధికారులు
నెలలు గడిచిపోతున్నా రష్యా-ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు కార్డు పడలేదు. ఇంకెంత కాలం కొనసాగుతుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. సర్వం కోల్పోతున్నా, నగరాలు శ్మశానాలను తలపిస్తున్నా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఏమాత్రం తగ్గడం లేదు. చివరి శ్వాస వరకు తగ్గేదే లే అన్నట్టుగా ముందుకు సాగుతున్నారు. ఈ యుద్దంలో ఉక్రెయిన్ భారీ సంఖ్యలో సైనికులను కోల్పోయింది. 

ఇప్పటి వరకు 13 వేల మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయి ఉంటారని జెలెన్ స్కీ సలహాదారు మైఖెలో పోదోలియాక్ చెప్పారు. తమకు అందుతున్న సమాచారం ప్రకారం 12,500 నుంచి 13 వేల మంది సైనికులు చనిపోయారని తెలిపారు. ఇంతే సంఖ్యలో సైనికులు గాయపడ్డారని చెప్పారు. మరణాల విషయంలో తాము ఏదీ దాచడం లేదని అన్నారు. 

మరోవైపు అమెరికా ఆర్మీ ఉన్నతాధికారులు మాట్లాడుతూ, ఉక్రెయిన్ లో సుమారు లక్ష మంది సైనికులను రష్యా కోల్పోయిందని తెలిపారు. ఉక్రెయిన్ కూడా పెద్ద సంఖ్యలోనే సైనికులను కోల్పోయిందని చెప్పారు. కాగా, యుద్ధాన్ని ముగించాలని రష్యా, ఉక్రెయిన్ లను ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.
Ukraine
Russia
War
Soldiers
Death

More Telugu News