Vitamin D: కశ్మీర్ వాసుల్లో అత్యధిక స్థాయిలో విటమిన్ డి లోపం... ఎందుకంటే...!
- ఆరోగ్యానికి కీలకం విటమిన్ డి
- ప్రధానంగా సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్
- కశ్మీర్ లో మంచు మయం
- సగటు సూర్యరశ్మికి దూరంగా ప్రజలు
- హెల్త్ లైన జర్నల్ లో తాజా అధ్యయనం
మానవ దేహం సంక్లిష్టమైన వ్యవస్థలతో కూడిన నిర్మాణం. ఇందులో ఏ వ్యవస్థ దెబ్బతిన్నా ఆ ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. అందుకు సరైన ఆహారం తీసుకోవాలని, తద్వారా పోషకాలతో శరీర ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని వైద్య నిపుణులు చెబుతుంటారు.
మన శరీరానికి అవసరమైన పోషకాలలో విటమిన్లు ముఖ్యమైనవి. వీటన్నింటిలో విటమిన్ డి కీలకమైనది. ఈ అత్యంత ఆవశ్యకమైన విటమిన్ కు సంబంధించి ఇటీవల ఓ అధ్యయనంలో ఆసక్తికర అంశం వెల్లడైంది.
భారత్ లో అత్యధిక స్థాయిలో విటమిన్ డి లోపంతో బాధపడుతున్నవారు కశ్మీర్ లోనే ఎక్కువమంది ఉన్నారట. కశ్మీర్ వాసుల్లో, ముఖ్యంగా అక్కడి మహిళల్లో అత్యధికస్థాయిలో విటమిన్ డి లోపం ఉన్నట్టు గుర్తించారు. అందుకు గల కారణాలను ఆ అధ్యయనంలో వివరించారు. హెల్త్ లైన్ జర్నల్ అనే ఆరోగ్య సంబంధ పత్రికలో ఈ అధ్యయనం ప్రచురితమైంది.
ప్రధానంగా విటమిన్ డి అనేది సూర్యరశ్మి ద్వారా లభ్యమవుతుంది. కానీ సంవత్సరంలో చాలాభాగం మంచు దుప్పట్లు పరిచినట్టుండే కశ్మీర్ లో సూర్యరశ్మి లభించడం చాలా తక్కువ. దాంతో అక్కడి ప్రజలకు సహజంగానే విటమిన్ డి చాలా తక్కువ మోతాదులోనే అందుతుంది. కశ్మీర్ రైతుల్లో విటమిన్ డి లోపం 58 శాతం ఉండగా, అక్కడి ఉద్యోగుల్లో అది 93 శాతం వరకు ఉంది.
కశ్మీర్ ప్రజలు ఒక వారంలో గ్రహించాల్సిన సగటు సూర్యకాంతి కంటే చాలా తక్కువస్థాయిలో సూర్యకాంతిని పొందుతున్నట్టు అధ్యయనంలో పేర్కొన్నారు. దేశంలోని మిగతా భాగాల్లో చలికాలం విజృంభించే అక్టోబరు-మార్చి సీజన్ లో కశ్మీర్ పరిస్థితి చెప్పనక్కర్లేదు. కశ్మీర్ లోయలో ఆ ఆరు నెలల్లో రక్తాన్ని గడ్డకట్టించేలా శీతల వాతావరణం నెలకొంటుంది. ఈ కాలంలో లభించాల్సినంత సూర్యరశ్మి లభించదు.
ఈ కారణంగానే కశ్మీర్ ప్రజల్లో విటమిన్ డి లోపం తీవ్రస్థాయిలో ఉందని శ్రీనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఇక్బాల్ సలీమ్ వెల్లడించారు. సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా ఇక్కడి వారిలో కీలకమైన విటమిన్ లోపానికి దారితీస్తోందని అభిప్రాయపడ్డారు. పురుషులతో పోల్చితే మహిళలు ఇళ్లవద్దనే ఉండడం కూడా వారిలో అత్యధికస్థాయిలో విటమిన్ డి కొరత ఏర్పడుతోందని వివరించారు.
ఒకరకంగా చెప్పాలంటే ఇది ప్రాణాధార విటమిన్ అని, దీన్ని ఆహారం ద్వారా పొందాలంటే ఎక్కువగా పాలు, పాల ఉత్పత్తులు, ఫలాలు, కూరగాయలు తీసుకోవాలని డాక్టర్ ఇక్బాల్ సలీమ్ సూచించారు.