china: చైనాలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. 40 వేలు దాటిన రోజువారీ కేసులు
- నాలుగు రోజులుగా రోజూ 30 వేల పైనే నమోదు
- ఆంక్షలు వద్దంటూ రోడ్డెక్కుతున్న జనం
- కఠినంగా అణచివేస్తున్న జిన్ పింగ్ ప్రభుత్వం
- జనం గుమికూడడం వల్లే కేసులు పెరుగుతున్నాయంటున్న నిపుణులు
చైనాలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. ప్రపంచ దేశాల్లో చాలా వరకు నియంత్రణలోకి వచ్చిన ఈ మహమ్మారి చైనాలో మరోమారు విజృంభిస్తోంది. గత నాలుగైదు రోజులుగా దేశంలో వైరస్ కేసులు 30 వేలకు పైనే నమోదవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. కరోనా కట్టడికి జిన్ పింగ్ ప్రభుత్వం అమలు చేస్తున్న జీరో కొవిడ్ పాలసీ ఫలితమివ్వడంలేదు. కఠిన ఆంక్షలు అమలుచేస్తుండడంతో చాలామంది ఆకలికి మాడి చనిపోతున్నారని, వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడంలేదని చైనీయులు ఆందోళన చేస్తున్నారు. కరోనా ఆంక్షలు తొలగించాలని బీజింగ్, షాంఘై, షింజియాంగ్ తదితర నగరాల్లో జనం ఆందోళనలు చేస్తున్నారు.
తాజాగా ఆదివారం చైనాలో 40,347 కరోనా కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఇందులో 3,822 మంది బాధితుల్లో వైరస్ లక్షణాలు కనిపించగా.. మిగతా 36,525 మందిలో లక్షణాలు కనిపించలేదని వైద్యులు తెలిపారు. వైరస్ కారణంగా ఆదివారం ఒక్కరు కూడా చనిపోలేదని వివరించారు. జీరో కొవిడ్ పాలసీకి వ్యతిరేకంగా జనం చేస్తున్న ఆందోళనల వల్లే కేసులు పెరుగుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా పెద్ద సంఖ్యలో జనం గుమికూడడం వల్లే దేశంలో వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోందన్నారు.
దేశంలో కరోనాను కట్టడి చేయడానికి జిన్ పింగ్ ప్రభుత్వం జీరో కొవిడ్ పాలసీని అమలులోకి తీసుకొచ్చింది. కఠిన ఆంక్షలతో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఒక్క కేసు బయటపడ్డా సరే.. సదరు బిల్డింగ్ ను సీజ్ చేయడం, జనాలను ఇళ్లల్లోనే ఐసోలేట్ చేయడం, చుట్టుపక్కల ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించడం.. తదితర చర్యలు తీసుకుంటోంది. దీంతో ఆకలితో మాడుతున్నామని, చాలామంది తిండిలేక చనిపోయారని చైనా ప్రజలు చెబుతున్నారు. ఆంక్షల తీరును తప్పుబడుతూ, జిన్ పింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.