warangal: తండ్రి విదేశాల నుంచి తీసుకొచ్చిన చాక్లెట్.. కుమారుడి ప్రాణం తీసింది

boy died after chocolate stuck throat in warangal
  • వరంగల్ లో ఓ కుటుంబంలో తీవ్ర విషాదం
  • చాక్లెట్ తింటూ పాఠశాలలో స్పృహ తప్పి పడిపోయిన 8 ఏళ్ల విద్యార్థి
  • గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక కన్నుమూత
విదేశాల నుంచి వస్తూ తండ్రి ప్రేమగా తీసుకొచ్చిన ఓ చాక్లెట్ ఓ కుమారుడి ప్రాణం తీసింది. అమ్మ చేతితో ఇచ్చిన చాక్లెట్‌ను చప్పరిస్తూ హుషారుగా పాఠశాలకు వెళ్లిన పిల్లాడు.. విగతజీవిగా ఇంటికి వచ్చాడు. ఈ విషాద సంఘటన వరంగల్ లో చోటు చేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన కన్‌గహాన్‌సింగ్‌ 20 ఏళ్ల క్రితం వ్యాపారం నిమిత్తం వరంగల్‌కు వలస వచ్చాడు. జేపీఎన్‌ రోడ్‌లో ఎలక్ట్రికల్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య గీత, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. 

వ్యాపార పనుల్లో భాగంగా కన్‌గహాన్‌ ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లాడు. వస్తూవస్తూ పిల్లల కోసం అక్కడి చాక్లెట్లు తెచ్చాడు. చిన్నారులు పాఠశాలకు వెళ్లే ముందు తండ్రి తెచ్చిన చాక్లెట్లు తీసుకెళ్లారు. కన్‌గహాన్‌ రెండో కుమారుడు సందీప్‌ (8) చాక్లెట్‌ చప్పరిస్తూ పాఠశాల మొదటి అంతస్తులోని తరగతి గదికి వెళ్లాడు. కాసేపటికే స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. సందీప్‌ గొంతులో చాక్లెట్‌ ఇరుక్కున్నట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స అందిస్తుండగానే ఊపిరాడక అతడు చనిపోయాడు.
warangal
boy
dies
chocolate

More Telugu News