AAP: డ్రైఫ్రూట్స్, సలాడ్స్ ఇప్పించండి.. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన 'ఆప్' మంత్రి

Jailed Delhi minister Satyendar Jain demands dry fruits salads in Tihar Jail

  • మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యేంద్ర జైన్
  • ఆరు నెలలుగా తీహార్ జైల్లోనే ఉంటున్న మంత్రి
  • అప్పటి నుంచి పండ్లు, పళ్ల రసాలే ఆహారంగా తీసుకుంటున్నారని ఆయన లాయర్ వెల్లడి
  • జైలు నిబంధనలకు లోబడే పళ్లు తెప్పించుకుంటున్నారని వివరణ

తీహార్ జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ ఢిల్లీ 'ఆప్' మంత్రి సత్యేంద్ర జైన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జైలు గదిలో మంత్రి మసాజ్ చేయించుకుంటున్న ఓ వీడియో ఇటీవల వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే, ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారని మంత్రిని ఆమ్ ఆద్మీ పార్టీ వెనకేసుకువచ్చింది. తాజాగా, ఆ వీడియోలో మంత్రితో పాటు కనిపించింది ఫిజియో థెరపిస్ట్ కాదని, అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ అని బయటపడింది. ఈ క్రమంలోనే మంత్రి సత్యేంద్ర జైన్ తనకు డ్రై ఫ్రూట్స్ ఇప్పించాలంటూ కోర్టుకెక్కడం సంచలనంగా మారింది.

మంత్రి సత్యేంద్ర జైన్ తరఫున ఆయన లాయర్ సోమవారం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. జైలు అధికారులు తన క్లయింట్ ను ఆకలితో మాడ్చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా జైలులోనే ఉంటున్న తన క్లయింట్.. తన మత విశ్వాసాలకు అనుగుణంగా ఉపవాసం చేస్తున్నారని చెప్పారు. ఆరు నెలలుగా డ్రైఫ్రూట్స్, పళ్లు, సలాడ్ లనే ఆహారంగా తీసుకుంటున్నారని చెప్పారు.

తీహార్ జైలులోని మిగతా ఖైదీల మాదిరిగా, జైలు నిబంధనలకు లోబడి తన క్లయింట్ డ్రైఫ్రూట్స్ కొనుగోలు చేసుకుంటున్నారని జైన్ లాయర్ వివరించారు. అయితే, గడిచిన 12 రోజులుగా జైలు అధికారులు డ్రైఫ్రూట్స్ అందించడం లేదని, తన క్లయింట్ ను ఆకలితో మాడ్చేస్తున్నారని ఆరోపించారు. తన క్లయింట్ సత్యేంద్ర జైన్ ఉపవాసం కొనసాగించుకునేందుకు వీలుగా, ఆయనకు డ్రైఫ్రూట్స్ అందించేలా జైలు అధికారులను ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

More Telugu News