Kerala: కేరళలో బోల్తాపడిన ఏపీ భక్తుల బస్సు

Andhra Pradesh Devotees Injured In Bus Accident At Kerala

  • బస్సులో 40 మంది అయ్యప్ప భక్తులు
  • 18 మందికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం
  • శబరిమల వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం

కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు నుంచి శబరిమల వెళ్లిన భక్తులు గాయపడ్డారు. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో 18 మందికి గాయాలు అయ్యాయని సమాచారం. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది.

పథనంతిట్ట జిల్లాలోని లాహా దగ్గర బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో పిల్లలు, మహిళలతో పాటు 40 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. బాధితులను కొట్టాయంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ప్రమాద స్థలాన్ని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జి సందర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఏలూరుకు చెందిన 84 మంది రెండు బస్సులలో శబరిమల యాత్రకు వెళ్లారు. ఈ నెల 15న మొదలైన యాత్ర శబరిమల వరకూ సాఫీగానే సాగింది. అయ్యప్ప దర్శనం తర్వాత తిరిగొస్తుండగా పథనంతిట్ట జిల్లాలోని లాహా దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద వార్త విని ఏలూరులోని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. కాగా, బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. సీఎంవో అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అవసరమైన సాయం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

  • Loading...

More Telugu News