IPL: ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన కీరన్ పొలార్డ్

Kieron Pollard says goodby to ipl

  • ఐపీఎల్ లో ఆది నుంచి ఆడుతూ వస్తున్న పొలార్డ్
  • ముంబై ఇండియన్స్ ఆటగాడిగా కొనసాగిన వైనం
  • వచ్చే సీజన్ లో పొలార్డ్ ను వదులుకునే దిశగా ముంబై ఇండియన్స్
  • అంతకుముందే ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విండీస్ క్రికెటర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వెస్టిండిస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్... ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. ఈ మేరకు వచ్చే సీజన్ నుంచి తాను ఐపీఎల్ ఆడటం లేదంటూ అతడు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ అత్యధిక సార్లు టైటిల్ విజేతగా నిలవగా... ఆ జట్టు విజయాల్లో పొలార్డ్ కీలక భూమిక పోషించాడు. ఆది నుంచి ముంబై ఇండియన్స్ కే ఆడిన అతడు... చివరి దాకా ఆ జట్టుతోనే ప్రస్థానం సాగించాడు. ఐపీఎల్ కు దూరమైనా కూడా తాను ముంబై ఇండియన్స్ తోనే సాగనున్నట్లుగా పొలార్డ్ ప్రకటించాడు.

ఐపీఎల్ లో మేటి ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు దక్కించుకున్న పొలార్డ్... ఐపీఎల్ లో మొత్తంగా 171 ఇన్నింగ్స్ లు ఆడి 3,412 పరుగులు చేశాడు. అందులో 16 హాఫ్ సెంచరీలున్నాయి. బౌలింగ్ లో 69 వికెట్లు తీసిన పొలార్డ్ 103 క్యాచ్ లతో బెస్ట్ ఆల్ రౌండర్ గానే కాకుండా బెస్ట్ ఫీల్డర్ గానూ గుర్తింపు సాధించాడు. అయితే గత సీజన్ లో పేలవ ప్రదర్శన కనబరచిన పొలార్డ్ ను వచ్చే సీజన్ కు వదులుకునే దిశగా ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం ఆలోచన చేస్తుండగా... అంతకుముందే పొలార్డ్ ఏకంగా ఐపీఎల్ కే వీడ్కోలు పలకడం గమనార్హం. అయితే ఆటగాడిగా ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన పొలార్డ్... తాను ఆడిన ముంబై ఇండియన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా మారే అవకాశాలున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

IPL
Mumbai Indians
Kieron Pollard
West Indies
Cricket

More Telugu News