Andhra Pradesh: ఢిల్లీ లిక్కర్ స్కాం వెనుక జగన్, విజయసాయిరెడ్డి హస్తం: బొండా ఉమా
- ఫార్మా రంగంలోని అరబిందో లిక్కర్ వ్యాపారం చేయాల్సిన అవసరమేంటన్న బొండా ఉమా
- విజయసాయిరెడ్డి ప్రోద్బలంతోనే శరత్ చంద్రారెడ్డి లిక్కర్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపణ
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో అందిన ముడుపులు ఏపీ నుంచి సేకరించినవేనని విమర్శ
- ఏపీలో లిక్కర్ వ్యాపారంపై దర్యాప్తు జరగాలని డిమాండ్
ఢిల్లీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హస్తం ఉందని బొండా ఉమా ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా 10 ప్రశ్నలను సంధించిన బొండా ఉమా... వాటికి వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి బంధువేనన్న బొండా ఉమా... ఢిల్లీలో మద్యం సిండికేట్ కు శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన ముడుపులు ఏపీ నుంచి సేకరించిన నిధులేనని ఆరోపించారు. ఫార్మా రంగంలో ఉన్న అరబిందో సంస్థకు లిక్కర్ వ్యాపారం చేసే అవసరం ఏమొచ్చిందని కూడా ఆయన ప్రశ్నించారు. దీనికి కారణం విజయసాయిరెడ్డేనని కూడా ఆయన ఆరోపించారు.
విజయసాయిరెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారానే శరత్ చంద్రారెడ్డికి ఢిల్లీలోని లిక్కర్ వ్యాపారంలో మెజారిటీ షేర్ దక్కిందన్నారు. శరత్ చంద్రారెడ్డి ద్వారా విజయసాయిరెడ్డి చేస్తున్న ఈ దందా జగన్ కు తెలియకుండా జరుగుతుందా? అని కూడా బొండా ఉమా ప్రశ్నించారు. ఏపీలో మద్యం అమ్మకాలు నగదు రూపేణా జరుగుతున్న వైనంపైనా తమకు అనుమానాలున్నాయని,. ఈ వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.