Telangana: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడికి ఫ్లయిట్ టికెట్ బుక్ చేసిన బండి సంజయ్ బంధువు
- ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా సింహయాజీ
- గత నెల 26న తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చిన నిందితుడు
- సింహయాజీకి ఫ్లయిట్ టికెట్లు సమకూర్చిన కరీంనగర్ న్యాయవాది
- తమ ఎమ్మెల్యేలకు యూపీ, గుజరాత్ ల నుంచి బెదిరింపులు వస్తున్నాయన్న టీఆర్ఎస్
- టీఆర్ఎస్ ఆరోపణలను ఖండించిన బీజేపీ
తెలంగాణలో రాజకీయ ప్రకంపనలకు కారణమైన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన నిందితులకు బీజేపీతో సంబంధాలున్నాయని, బీజేపీ ప్లాన్ లో భాగంగానే నిందితులు హైదరాబాద్ వచ్చారంటూ టీఆర్ఎస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ సర్కారు ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించగా... హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ శనివారమే ఈ కేసు దర్యాప్తును మొదలుపెట్టింది.
ఈ క్రమంలో సిట్ అధికారులు తొలి రోజే ఓ కీలక విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన ముగ్గురు నిందితుల్లో ఒకరైన సింహయాజీకి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ బంధువు ఫ్లయిట్ టికెట్లను సమకూర్చారని సిట్ తేల్చింది. ఆయన కరీంనగర్ లో న్యాయవాదిగా పనిచేస్తున్నట్లు కూడా సిట్ నిర్ధారించుకుంది. అయితే ఆయన పేరును మాత్రం సిట్ వెల్లడించలేదు.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన నిందితులు గత నెల 26న తిరుపతి నుంచి హైదరాబాద్ రాగా... వారిలో సింహయాజీకి బండి సంజయ్ బంధువు విమాన టికెట్లను సమకూర్చారట. అంతేకాకుండా ఈ కేసులోని మరో నిందితుడు నందకుమార్ తో కూడా సదరు న్యాయవాది గత నెల 14న ఫోన్ లో మాట్లాడినట్లుగా కూడా సిట్ నిర్ధారించుకుంది. ఇదిలా ఉంటే... ఈ కేసులో బాధితులుగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గుజరాత్, ఉత్తర ప్రదేశ్ ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నట్లుగా టీఆర్ఎస్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది.