Narendra Modi: మోదీ కార్యక్రమానికి కేసీఆర్ దూరం.. ప్రధానికి ఆహ్వానం పలకనున్న మంత్రి తలసాని
- మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాదుకు చేరుకోనున్న మోదీ
- రామగుండంలో ఫర్టిలైజర్స్ కంపెనీని జాతికి అంకితం చేయనున్న ప్రధాని
- సాయంత్రం 6.40 గంటలకు ఢిల్లీకి తిరుగుపయనం
ప్రధాని మోదీ విశాఖ పర్యటన ముగిసింది. కాసేపట్లో తెలంగాణ పర్యటనకు గాను విశాఖ నుంచి హైదరాబాద్ కు మోదీ బయల్దేరనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి దూరంగా ఉండబోతున్నారు. విమానాశ్రయంలో ప్రభుత్వం తరపున స్వాగతం పలికేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లనున్నారు. మోదీ తిరుగుపయనం అయ్యేటప్పుడు కూడా తలసానే వీడ్కోలు పలకనున్నారు. మరోవైపు బేగంపేట విమానాశ్రయంలో మోదీకి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు బీజేపీ కీలక నేతలు స్వాగతం పలకనున్నారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ పార్టీ కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారు. అనంతరం పెద్దపల్లి జిల్లా రామగుండంకు బయల్దేరుతారు. అక్కడ రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ను జాతికి అంకితం చేయనున్నారు.
అనంతరం పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఆ తర్వాత ఎన్టీపీసీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ కు పయనమవుతారు. సాయంత్రం 6.40 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరుతారు.