Twitter Blue: ట్విట్టర్ కు ఏమైంది?.. కనిపించని బ్లూటిక్
- దీన్ని నిలిపివేసిన ట్విట్టర్
- కారణాలను వెల్లడించని సంస్థ
- ప్రముఖుల పేరిట నకిలీ ఖాతాలు
- వీటికి చందా చెల్లించిన నకిలీ బాబులు
ట్విట్టర్ పై గందరగోళానికి తెరపడడం లేదు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ యజమాని అయిన తర్వాత బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ సేవను ప్రకటించడం తెలిసిందే. ధ్రువీకరించిన ఖాతా అనే గుర్తింపు కోసం దీన్ని తీసుకొచ్చింది. దీనికి నెలకు 8 డాలర్ల చందా కూడా చెల్లించాలని ప్రకటించింది. బ్లూ టిక్ సేవను ముందు యాపిల్ ఐఫోన్ యూజర్లకు తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లకు ఇంకా రావాల్సి ఉంది. కానీ, ఈ బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ ను ట్విట్టర్ నిలిపి వేసినట్టు తెలుస్తోంది.
సబ్ స్క్రైబ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. ‘‘మీ ఆసక్తికి ధన్యవాదాలు. ట్విట్టర్ బ్లూ మీ దేశంలో త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. తర్వాత వచ్చి చెక్ చేసుకోండి’’ అంటూ సందేశం కనిపిస్తోంది. మరి బ్లూ సబ్ స్క్రిప్షన్ ను ట్విట్టర్ ఎందుకు తొలగించిందన్నది అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. అనధికారికంగా వినిపిస్తున్న సమాచారం మేరకు.. ట్విట్టర్ బ్లూ సబ్ స్క్రిప్షన్ సేవను ప్రకటించిన వెంటనే, కొందరు ప్రముఖుల పేరిట నకిలీ ఖాతాలు తెరిచి సబ్ స్క్రిప్షన్ చెల్లించినట్టు తెలుస్తోంది. దీంతో బోగస్ ఖాతాల ఏరివేత తర్వాత దీన్ని ప్రవేశపెట్టొచ్చని తెలుస్తోంది.