CEC: దేశంలో శతాధిక ఓటర్లు ఎంతమందో తెలుసా?
- దేశంలో వందేళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 2.49 లక్షలు
- 80 ఏళ్ల పైబడిన ఓటర్ల సంఖ్య 1.80 కోట్లుగా ఉందన్న సీఈసీ
- పూణెలో ఓటరు నమోదు చైతన్య కార్యక్రమం
దేశంలో శతాధిక వృద్ధులైన ఓటర్లు 2.49 లక్షల మంది ఉన్నట్టు దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ తెలిపారు. మహారాష్ట్రలోని పూణెలో నిన్న ఓటరు నమోదు చైతన్య కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సైకిల్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో 80 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 1.80 కోట్లుగా ఉందని తెలిపారు.
దేశంలోనే తొలి ఓటరు అయిన హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన శ్యాం శరణ్ నేగి ఇటీవల మరణించారు. ఆయన తన మరణానికి మూడు రోజుల ముందు కూడా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారని, ఇది స్ఫూర్తిదాయకమని అన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ప్రతి ఏడాది చేపడుతున్నామని, అయితే, ఈసారి పట్టణ ఓటర్ల భాగస్వామ్యం పెంచాలన్నదే తమ లక్ష్యమని రాజీవ్ కుమార్ తెలిపారు.