Team India: నేడు కింగ్ కోహ్లీ బర్త్ డే... అటు ఆస్ట్రేలియా, ఇటు హైదరాబాద్ లలో అదిరిపోయిన వేడుకలు

virat kohli cuts his birth cay cake in australia
  • టీమిండియా మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాటీ అప్టాన్ తో కలిసి కేక్ కట్ చేసిన కోహ్లీ
  • బీసీసీఐ పంపిన కేక్ ను కట్ చేసిన విరాట్
  • జట్టు సభ్యుల మధ్యే జన్మదిన వేడుకలు జరుపుకున్న వైనం
  • హైదరాబాద్ లో 50 అడుగుల ఎత్తున కోహ్లీ కటౌట్ ఏర్పాటు
భారత క్రికెట్ జట్టులో కీలక సభ్యుడు, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ జన్మదినం నేడు. తన జన్మదినాన కోహ్లీ తన ఇంటిలో కాకుండా టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీ జరుగుతున్న ఆస్ట్రేలియాలో ఉండిపోయాడు. కుటుంబ సభ్యులకు దూరంగా జట్టు సభ్యులతో కలిసి ఉంటున్న కోహ్లీ... తన బర్త్ డే వేడుకలను కూడా జట్టు సభ్యుల మధ్యే జరుపుకున్నాడు. కోహ్లీ బర్త్ డే సందర్భంగా శనివారం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేయగా... టీమిండియా మెంటల్ కండిషనింగ్ ఎక్స్ పర్ట్ ప్యాడీ అప్టాన్ తో కలిసి కోహ్లీ బర్త్ డే కేక్ ను కట్ చేశాడు. 

జట్టు కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డ కోహ్లీ... తాజా టీ20 వరల్డ్ కప్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు నమోదు చేసిన క్రికెటర్ గా కోహ్లీ అరుదైన రికార్డును నమోదు చేశాడు. మునుపటి ఫామ్ తో కనిపిస్తున్న కోహ్లీ... ప్రత్యర్థి జట్టు బౌలర్లకు సింహస్వప్నంలా కనిపిస్తున్నాడు. వెరసి ఈ బర్త్ డే కోహ్లీకి వెరీ వెరీ స్పెషలేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

ఇదిలా ఉంటే... బర్త్ డే సందర్భంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో టాలీవుడ్ హీరో స్థాయి ఎలివేషన్ ను కోహ్లీ అందుకున్నాడు. కోహ్లీ బర్త్ డేను పురస్కరించుకుని నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పరిధిలో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ వద్ద అతడి 50 అడుగుల ఎత్తున్న కటౌట్ వెలిసింది. క్రికెట్ లో సరికొత్త రికార్డులను లిఖిస్తూ సాగుతున్న కోహ్లీకి మరిచిపోలేని గుర్తుగా హైదరాబాదీ అభిమానులు ఈ కటౌట్ ను ఆవిష్కరించారు.
Team India
Australia
T20 World Cup
Virat Kohli
Birth Day
Hyderabad
Cutout

More Telugu News