Nara Lokesh: సీఎం ఇంటిముందే ఓ మహిళ న్యాయం కోసం ఆత్మహత్యాయత్నం చేసిందంటే ఇంతకంటే ఘోరం ఉంటుందా?: నారా లోకేశ్

Lokesh slams CM Jagan over woman suicide attempt
  • అమరావతికి వచ్చిన కాకినాడ జిల్లా మహిళ
  • న్యాయం చేయాలంటూ సీఎంని కలిసే ప్రయత్నం
  • దొరకని అపాయింట్ మెంట్
  • బ్లేడుతో మణికట్టు కోసుకున్న వైనం
  • తీవ్రంగా స్పందించిన లోకేశ్
కాకినాడ జిల్లాకు చెందిన ఆరుద్ర అనే మహిళ చక్రాల కుర్చీకే పరిమితమైన తన కుమార్తెను ఆదుకోవాలని సీఎం జగన్ ను కలిసేందుకు వచ్చి, ఆ ప్రయత్నం ఫలించక ఆత్మహత్యాయత్నం చేయడం తెలిసిందే. 

వెన్నెముక సమస్యతో బాధపడుతున్న కుమార్తెకు చికిత్స కోసం రూ.2 కోట్లు కావాల్సి ఉండగా, తన ఇంటిని అమ్ముకోనివ్వకుండా ఇద్దరు పోలీసు సిబ్బంది అడ్డుపడుతున్నారని ఆమె ఆరోపించారు. వారిలో ఒకరు మంత్రి దాడిశెట్టి రాజా గన్ మన్ అని తెలిపారు. అమరావతిలో సీఎంను కలిసేందుకు అధికారులు ఒప్పుకోకపోవడంతో ఆమె బ్లేడుతో మణికట్టు కోసుకున్నారు. 

దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి ఇంటి ముందే న్యాయం కోసం ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసిందంటే ఇంతకంటే ఘోరం ఉంటుందా? అని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత తల్లి, చెల్లిని తరిమేసిన జగన్ రెడ్డి పాలనలో సామాన్య మహిళల కష్టాలు తీరుతాయనుకోవడం అత్యాశేనని పేర్కొన్నారు.  

తాడేపల్లి ప్యాలెస్ లో అభినవ నీరో జగన్ రెడ్డికి కాకినాడలో వైసీపీ నేతల అరాచకాలు కనపడవు అని విమర్శించారు. అచేతన స్థితిలో ఉన్న కుమార్తెకి  వైద్యం చేయించలేని ఆడపడుచు ఆరుద్ర ఆత్మహత్యాయత్నం ఆర్తనాదాలు వినపడవు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆ బిడ్డ వైద్యానికి తక్షణమే సాయం అందించాలని నారా లోకేశ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆత్మహత్యాయత్నం చేసిన ఆరుద్ర ప్రాణాలు కాపాడాలని స్పష్టం చేశారు. మంత్రి పేరుతో కబ్జాలు, బెదిరింపులకు పాల్పడుతున్న కానిస్టేబుళ్లని అరెస్టు చేయాలని పేర్కొన్నారు.

కాగా, ఇదే ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా  స్పందించారు. అన్నవరానికి చెందిన ఆరుద్ర అనే మహిళ న్యాయం కోసం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరం అని పేర్కొన్నారు.

కూతురి వైద్యానికి తన ఇంటిని అమ్ముకునే స్వేచ్ఛ కూడా ఆమెకు లేకుండా చేయడం దారుణమని తెలిపారు. దీనికి కారణం అయిన మంత్రి గన్ మెన్ తదితరులపై వెంటనే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏపీలో అధికార మదంతో సామాన్య ప్రజలపై జరుగుతున్న వేధింపులకు ముగింపు ఎప్పుడు? అని మండిపడ్డారు. 

తనకు న్యాయం చేయమని గతంలో కాకినాడ కలెక్టరేట్ ముందు ఆరుద్ర ధర్నా చేసినప్పుడే ప్రభుత్వం చర్యలు తీసుకుని వుంటే ఇంతవరకు వచ్చేదా? అని ప్రశ్నించారు. ప్రజలను కలవాలంటే ఈ ముఖ్యమంత్రికి అహంకారం అడ్డొస్తుందా? అని నిలదీశారు. ప్రజల సమస్యలు పరిష్కరించలేనప్పుడు పబ్లిసిటీకి పరిమితమైన స్పందన కార్యక్రమంతో ఎవరికి ఉపయోగం? అని విమర్శించారు. ఆత్మహత్యకు యత్నించిన మహిళను ఆదుకోవాలని స్పష్టం చేశారు.
Nara Lokesh
Arudra
Jagan
Suicide Attempt
Amaravati

More Telugu News