Sriram Krishnan: ఇప్పుడు ట్విట్టర్ లో కీలక వ్యక్తి మరో భారతీయుడు!

Who is Sriram Krishnan a Twitter insider helping Elon Musk steady the ship

  • పరాగ్ అగర్వాల్ వెళ్లినా.. మరో భారతీయుడికి చోటు
  • ట్విట్టర్ నిర్వహణకు ఏర్పాటు చేసిన కమిటీలో శ్రీరామ్ కృష్ణన్
  • అతడు ట్విట్టర్ మాజీ ఉద్యోగే

ట్విట్టర్ కొత్త యజమాని, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మొదటి రోజే సంస్థ సీఈవో స్థానంలో ఉన్న భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్ ను సాగనంపారు. రూ.3.6 లక్షల కోట్లకు ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ సంస్థ బోర్డును రద్దు చేసి, ఓ కమిటీని నియమించారు. కానీ, ఈ కమిటీలో ఇప్పుడు కీలకంగా వ్యవహరిస్తోంది కూడా ఓ భారతీయుడే. అతడే శ్రీరామ్ కృష్ణన్. 

శ్రీరామ్ కృష్ణన్ అనే కాదు.. పరాగ్ అగర్వాల్, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల ఇలా ఎంతో మంది భారత సత్తా ఏంటో చేతల్లో నిరూపిస్తున్నారు. టెక్నాలజీపై భారతీయులకు ఉన్న పట్టు వేరు. అందుకే అవ్వడానికి అమెరికా టెక్ దిగ్గజాలైనప్పటికీ భారతీయ నిపుణులను నమ్ముకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు పెద్దగా తెలియని శ్రీరామ్ కృష్ణన్ పేరు ప్రచారంలోకి వచ్చింది. 

ఎవరీయన..?
శ్రీరామ్ కృష్ణన్ ట్విట్టర్ మాజీ ఉద్యోగి. 2017 నుంచి 2019 వరకు ట్విట్టర్లోనే పనిచేశారు. ప్రస్తుతం వెంచర్ క్యాపిటల్ సంస్థ ఆండ్రెస్సెన్ హరోవిట్జ్- ఏ16జెడ్ లో పార్ట్ నర్ గా, ఇన్వెస్టర్ గా ఉన్నారు. మస్క్ ట్విట్టర్ కొనుగోలుకు పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు మస్క్ ఏర్పాటు చేసుకున్న కమిటీలో శ్రీరామ్ కృష్ణన్ కీలకంగా వ్యవహరించనున్నారు. మస్క్ ఆకాంక్షలకు అనుగుణంగా ట్విట్టర్ ను ముందుకు తీసుకెళ్లడం ఈ కమిటీ ముందున్న టాస్క్. కొందరు అయితే దీన్నే ట్విట్టర్ మేనేజ్ మెంట్ గా అభివర్ణిస్తున్నారు. అనుకున్న ఫలితాలను సాధిస్తే భవిష్యత్తులో శ్రీరామ్ కృష్ణన్ ను మరింత పెద్ద పదవి వరించే అవకాశం లేకపోలేదు. పరాగ్ ను తప్పించడం వల్ల ఎదురయ్యే నష్టాన్ని శ్రీరామ్ కృష్ణన్ తో మస్క్ కొంత వరకు పూడ్చుకున్నారు. ఎందుకంటే శ్రీరామ్ లోగడ రెండేళ్లకు పైగా ట్విట్టర్ లో పనిచేసి వెళ్లినవాడే.

గొప్ప వ్యక్తులతో కలసి తాను ఇప్పుడు ట్విట్టర్ కు తాత్కాలికంగా సేవలు అందిస్తున్నట్టు శ్రీరామ్ ఓ ట్వీట్ కూడా చేశారు. ‘‘ఇది ఎంతో ముఖ్యమైన, ప్రపంచంపై ఎంతో ప్రభావం చూపించే కంపెనీ కాగలదు’’ అని పేర్కొన్నారు. శ్రీరామ్ విద్యాభ్యాసం అంతా చెన్నైలో జరిగింది. అన్నా యూనివర్సిటీ పరిథిలోని ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేశాడు. ఆ సమయంలోనే ఆర్తి రామమూర్తి 2003లో శ్రీరామ్ కు పరిచయం అయింది. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమార్తె కూడా ఉంది. తొలుత 2005లో శ్రీరామ్ కృష్ణన్ మైక్రోసాఫ్ట్ లో పనిచేశారు. ఆర్తి కూడా అక్కడే పనిచేసింది.

  • Loading...

More Telugu News