Ambati Rambabu: పవన్ ప్రయత్నాలన్నీ చంద్రబాబును సీఎం చేయడానికే... జనసేనకు కాపులు మద్దతు ఇవ్వాల్సిన అవసరంలేదు: అంబటి రాంబాబు

Ambati Rambabu comments on Pawan Kalyan and Janasena
  • రాజమండ్రిలో వైసీపీ కాపు నేతల సమావేశం
  • టీడీపీ హయాంలో కాపులను అణచివేశారన్న అంబటి 
  • పవన్ రాజకీయాలకు పనికిరాడని విమర్శలు
రాజమండ్రిలో వైసీపీ కాపు నేతల సమావేశం ముగిసిన అనంతరం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. టీడీపీ పాలనలో కాపులను అణచివేసే కార్యక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ అనేక కాపు వ్యతిరేక చర్యలు చేపట్టి కాపు వ్యతిరేక పార్టీగా ముద్రపడిందని అంబటి అన్నారు.  

వంగవీటి రంగా హత్య, రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేయడం, ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకు చంద్రబాబు అనుసరించిన విధానం, ముద్రగడను కొట్టడం, ఆయన భార్యను తిట్టడం, వారి కుమారుడ్ని వేధించడం, ముద్రగడను జైల్లో పెట్టినట్టుగా ఓ సెల్ లో ఉంచడం తదితర అంశాలతో టీడీపీ కాపు వ్యతిరేక ముద్ర పొందిందని అంబటి రాంబాబు వివరించారు. 

గతంలో వైఎస్సార్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు సీఎం జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం కానీ కాపులకు పెద్దపీట వేసి, వారిని గౌరవప్రదంగా చూస్తోందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రతి కాపు సోదరుడికి కూడా చేరవేయాలన్న ఉద్దేశంతో ఇవాళ తాము సమావేశమయ్యామని వెల్లడించారు. ఈ సమావేశం పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా ఏర్పాటు చేశారంటూ కొందరు అంటున్నారని, కానీ అందులో వాస్తవం లేదని అంబటి స్పష్టం చేశారు. 

మొన్న పవన్ కల్యాణ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడని, కాపు శాసనసభ్యులను కూడా దూషించాడని, పవన్ వ్యాఖ్యలను నేటి సమావేశంలో తాము తీవ్రంగా ఖండించామని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు చూస్తే పవన్ రాజకీయాల్లో పనికిరాడన్న విషయం అర్థమవుతోందని అన్నారు. రాజకీయాల్లో ఉండాలనుకునే వ్యక్తి ఈ భాష మాట్లాడడని అంబటి పేర్కొన్నారు. 

"పవన్ వైఖరి చూస్తే తాను సీఎం అవ్వాలని కోరుకుంటున్నట్టు లేదు... చంద్రబాబును సీఎం చేయాలని భావిస్తున్నట్టుంది. కొందరు కాపు యువకులు పవన్ కల్యాణ్ సీఎం కావాలని అనుకుంటున్నారు. కానీ పవన్ కల్యాణ్ చాలా నీచంగా దిగజారి మాట్లాడారు. 

వంగవీటి రంగాను హత్య చేస్తారని తెలిసినప్పుడు కాపులు ప్రతి గ్రామం నుంచి వెళ్లి ఎందుకు కాపలా కాయలేకపోయారు... ఈ హత్యకు కాపులు కూడా బాధ్యత వహించాలని పవన్ కల్యాణ్ అన్నాడు. ఇది అడిగిన గంటసేపటికే, రంగా హత్యకు ప్రధాన కారకుడైన చంద్రబాబును కలిశారు. ఎంత దుర్మార్గం ఇది! దీన్ని కూడా కాపు సమాజం గుర్తించాలి. ముద్రగడపై దాడి అనంతరం వైసీపీ నేతలపై కేసులు పెడితే సీఎం జగన్ ఒక్క కలం పోటుతో ఆ కేసులను ఎత్తివేసేలా చర్యలు తీసుకున్నారు. 

చాలా చిత్రమైన విషయం ఏమిటంటే... పవన్ కల్యాణ్ కాపు సమాజాన్నంతా తీసుకెళ్లి కాపులకు శత్రువైన చంద్రబాబుకు తాకట్టుపెట్టాలని చూస్తున్నాడు. ఇది ప్యాకేజీగా జరుగుతోందని ఎప్పటినుంచో చెబుతున్నాం. మొన్నటితో ఆ ముసుగు తొలగిపోయింది. చంద్రబాబును సీఎం చేసేందుకే పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నాడు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు పాటుపడుతున్న జనసేన పార్టీకి కాపులు ఎవరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరంలేదు" అని అంబటి రాంబాబు వివరించారు.
Ambati Rambabu
Pawan Kalyan
Chandrababu
Kapu
YSRCP
Janasena
TDP
Andhra Pradesh

More Telugu News