Bonda Uma: కాపుల ద్రోహి జగన్‌ రెడ్డికి వైసీపీ కాపు నేతలు ఊడిగం చేస్తున్నారు: టీడీపీ నేత బొండా ఉమ

Bonda Uma fires on YCP Kapu community leaders

  • రాజమండ్రిలో వైసీపీ కాపు నేతల భేటీ
  • పదవులకు కక్కుర్తి పడ్డారన్న ఉమ 
  • కాలర్ పట్టుకుని నిలదీయాలని కాపులకు పిలుపు

రాజమండ్రిలో వైసీపీ కాపు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం నిర్వహించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీడీపీ సీనియర్ నేత బొండా ఉమ స్పందించారు. కాపుల ద్రోహి జగన్ రెడ్డికి వైసీపీ కాపు నేతలు ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. పదవులకి కక్కుర్తి పడి తమ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించని ఏ ఒక్క కాపు మంత్రీ క్షమార్హుడు కాదని స్పష్టం చేశారు. 

పదవుల కోసం లాలూచీ పడిన ప్రతి ఒక్కరిని కాపు సోదరులు కాలర్‌ పట్టుకొని నిలదీయాలని, తమకు దక్కాల్సిన రిజర్వేషన్లు ఏవి? అని గట్టిగా అడగాలని పిలుపునిచ్చారు. గెలిపించిన పాపానికి కాపుల గొంతు కోసేందుకు జగన్‌ రెడ్డి పూనుకున్నారని విమర్శించారు. 

"విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఇతర అగ్రవర్ణాల వారి కంటే వెనుక బడి ఉన్న కాపు సామాజికవర్గాన్ని ఆదుకునే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు ఎంతో ముందు చూపుతో జనరల్ కేటగిరీ పేదల కోటాలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు కేటాయించారు. 2019లో జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చీ రాగానే కుట్ర పూరితంగా ఆ రిజర్వేషన్లను తొలగించాడు. 

కాపులకు 5% రిజర్వేషన్‌ రద్దుతో గత మూడేళ్లలో విద్యాసంస్థల్లో మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో కాపులకు తీరని అన్యాయం జరిగింది. జగన్‌ రెడ్డి చెబుతున్న సచివాలయ ఉద్యోగాల్లోనే దాదాపు 13వేల ఉద్యోగాలు కాపు యువత కోల్పోయారు. 

నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో కావులకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా తన సామాజికవర్గం వాళ్లకే ప్రాధాన్యత కలిగిన అన్ని పోస్టులను జగన్‌ రెడ్డి అప్పనంగా కట్టబెట్టేశాడు. కనీసం అలాంటి పోస్టులలో 5% కూడా కాపులకు ఇవ్వకుండా జగన్‌ వివక్ష చూపించాడు.

జగన్‌ క్యాబినెట్‌లో మంత్రులైన అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాధ్‌, కొట్టు సత్యనారాయణ, దాడిశెట్టి రాజా కేవలం జగన్‌ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రెడ్లకు కాపు కాస్తూ, బానిస బతుకులు బతుకుతున్నారు. వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకొని జగన్‌ రెడ్డిపై తిరుగుబాటు చెయ్యాలి. 

రాజకీయంగా విద్యాపరంగా ఆర్థికంగా కాపులు ఎదగడం జగన్‌ రెడ్డికి ఏమాత్రం గిట్టడం లేదు. తన సామాజిక వర్గం ఏమవుతుందో అన్న అభద్రత భావంతో ఉన్న సన్నాసి జగన్‌ రెడ్డి" అంటూ బొండా ఉమ విమర్శనాస్త్రాలు సంధించారు.

Bonda Uma
YCP Kapu Leaders
Jagan
TDP
Chandrababu
Andhra Pradesh
  • Loading...

More Telugu News