Kommanapalli: ఆ సినిమాకి పనిచేయనని నేను వెళ్లిపోతుంటే విజయశాంతిగారు ఆపారు: రచయిత కొమ్మనాపల్లి
- నవలా రచయితగా కొమ్మనాపల్లికి మంచి పేరు
- సినిమాలకి కూడా రైటర్ గా పనిచేసిన కొమ్మనాపల్లి
- ఆ డైరెక్టర్ ధోరణి తనకి నచ్చలేదంటూ వ్యాఖ్య
- అందుకే అతనిపై కోపం వచ్చిందని వెల్లడి
కొమ్మనాపల్లి గణపతిరావు అనేక నవలలు రాశారు. ఆయన అందించిన కథలతో కొన్ని సినిమాలు తెరకెక్కాయి కూడా. అయితే నవలా రచయితగా ఆయనకి వచ్చిన పేరు ఎక్కువ. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సినీ రచయితగా తనకి ఎదురైన అనుభవాలను గురించి ప్రస్తావించారు. ప్రముఖ నిర్మాతల దగ్గరికి వెళ్లినప్పుడు .. దర్శకులతో మాట్లాడేటప్పుడు నాకు కొన్ని చిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి" అన్నారు.
"ఒక దర్శకుడు లాజిక్ లేని పాయింట్ చెప్పి దానిపై రాసుకుని రమ్మంటాడు. మరొక దర్శకుడు చీప్ గా తనకి తోచిన ఒక ఆలోచన చెప్పి, ఆ సీన్ చేద్దామని చెబుతాడు. విలువలకు దూరంగా నేను ఆలోచన చేయలేను. ఈ విషయంపైనే ఒక దర్శకుడితో నాకు వాదన జరిగింది. అలాంటి సీన్స్ ను రాయను .. ఇలాంటి చోట నేను పనిచేయను అంటూ అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తూ ఉంటే, ఆ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న విజయశాంతిగారు నన్ను ఆపారు.
నేను ఆ దర్శకుడితో పని చేయనని ఆమెతో చెప్పాను. అప్పటికే ఆమె లేడీ సూపర్ స్టార్. 'నా మాట వినండి .. మధ్యలో వెళ్లిపోతే ఇబ్బంది అవుతుంది ..' అంటూ ఆమె రిక్వెస్ట్ చేశారు. ఆమె భర్తతోను చెప్పించారు. ఈ సినిమాకి మీరు పని చేయవలసిందే .. మానేయవద్దని అన్నారు. నిజానికి ఆ డైరెక్టర్ నాకు మంచి స్నేహితుడే. కానీ ఆయన భయం ఆయనది .. నా అభిప్రాయం నాది" అంటూ చెప్పుకొచ్చారు.