GO 51: ఏ తప్పూ చేయనప్పుడు సీబీఐ అంటే భయమెందుకు?: డీకే అరుణ
- జీవో 51 జారీపై తెలంగాణ సీఎంను ప్రశ్నించిన బీజేపీ లీడర్
- రాష్ట్రంలోకి సీబీఐకి అనుమతి నిరాకరించడంపై నిలదీత
- ఆగస్టులో జారీ చేసిన జీవోను ఇప్పటిదాకా రహస్యంగా ఎందుకు ఉంచారని ప్రశ్నించిన డీకే అరుణ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీబీఐని చూసి ఎందుకు భయపడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం బయటపెట్టిన జీవో 51 పై ఆమె స్పందించారు. ఏ తప్పూ చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముందని ముఖ్యమంత్రిని నిలదీశారు. సీబీఐకి గతంలో ఇచ్చిన సమ్మతిని ఎందుకు ఉపసంహరించుకున్నారని, ఆగస్టులో విడుదల చేసిన జీవోను ఇప్పటి దాకా రహస్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చిందని డీకే అరుణ ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని దోచుకోకుంటే, పేదల భూములను ధరణి పేరుతో కబ్జా చేయకుంటే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అంటే అంత ఉలికిపాటెందుకని డీకే అరుణ అన్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి చేసే ప్రయత్నాలు ఇకపై సాగవని చెప్పారు. జీవో 51 జారీ చేసి కేసుల నుంచి తప్పించుకోవచ్చని అనుకోవడం అమాయకత్వమేనని డీకే అరుణ పేర్కొన్నారు. తప్పు చేసి, ప్రజల సొమ్మును కాజేసిన వాళ్లు ఎక్కడ దాక్కున్నా బయటకు తీసుకొస్తామని డీకే అరుణ చెప్పారు.