Jogi Ramesh: వైసీపీకి ఓటు వేయకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీలు తప్పు చేసినట్టే అవుతుంది: జోగి రమేశ్
- బడుగు, బలహీన వర్గాలకు వైసీపీ ప్రభుత్వం ఎంతో చేస్తోందన్న జోగి రమేశ్
- యువతను పవన్ వంటి వారు రెచ్చగొడుతున్నారని విమర్శ
- కృష్ణా నదిపై 10 టీఎంసీల సామర్థ్యంతో వంతెన నిర్మిస్తామన్న మంత్రి
బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఉద్దేశించి ఏపీ మంత్రి జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బడుగు, బలహీన వర్గాలకు వైసీపీ ప్రభుత్వం సామాజిక న్యాయం చేస్తోందని ఆయన అన్నారు. ఇంత చేస్తున్న వైసీపీకి వచ్చే ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఓటు వేయకపోతే తప్పు చేసినవారవుతారని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు. యువతను పవన్ వంటి వారు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం పెదమద్దూరు వద్ద రూ. 44 కోట్లతో అమరావతి-తుళ్లూరు రహదారి, పెదమద్దూరు వాగుపై వంతెన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 10 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో కృష్ణా నదిపై త్వరలోనే వంతెనను నిర్మిస్తామని... ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, నంబూరు శంకరరావు హాజరయ్యారు.