Telangana: యాదాద్రి తీసుకెళ్లి ఓటర్లతో ప్రమాణాలు...టీఆర్ఎస్ పై కేసుకు ఈసీ ఆదేశం
- 300 మందిని యాదాద్రి తరలించిన టీఆర్ఎస్ నేతలు
- కారు గుర్తుకే ఓటేస్తామంటూ ఓటర్లతో ప్రమాణం చేయించిన వైనం
- వీడియో ఫుటేజీలు లభ్యం కావడంతో కేసు నమోదుకు ఈసీ ఆదేశం
తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి అధికార టీఆర్ఎస్ పై కేసు నమోదు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మునుగోడుకు చెందిన 300 మంది ఓటర్లను ప్రత్యేక బస్సుల్లో యాదాద్రి తీసుకెళ్లిన టీఆర్ఎస్ నేతలు...ఎన్నికల్లో తాము కారు గుర్తుకే ఓటేస్తామంటూ వారితో ప్రమాణం చేయించారట. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న ఈసీ తన పరిశీలకులతో ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేపట్టింది.
ఈసీ పరిశీలకుల విచారణలో భాగంగా ఓటర్లను టీఆర్ఎస్ నేతలు బస్సుల్లో యాదాద్రి తీసుకెళ్లడం, అక్కడ ఓటర్లతో ప్రమాణం చేయించిన వైనానికి సంబంధించిన వీడియోలు కూడా లభ్యమయ్యాయి. దీంతో ఈ ఫిర్యాదు నిజమేనని తేల్చిన ఈసీ... ఓటర్లతో ప్రమాణం చేయించిన టీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేయాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.