NTR: జపనీస్ భాషలో జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగం... వీడియో ఇదిగో!

NTR speaks Japanese during a promotion event in Japan

  • జపాన్ లో విడుదలైన ఆర్ఆర్ఆర్
  • ఎన్టీఆర్ కు జపనీయుల బ్రహ్మరథం
  • హోటల్ వద్ద కోలాహలం
  • తారక్ ను చూసి భావోద్వేగాలకు గురైన మహిళా అభిమాని

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ చిత్రం ఆర్ఆర్ఆర్ నేడు (అక్టోబరు 21) జపాన్ లో విడుదలైంది. ఈ సందర్భంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రస్తుతం జపాన్ లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఓ ప్రమోషన్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ జపనీస్ భాషలో ప్రసంగించి అభిమానులను అలరించారు. 

"మిమ్మల్ని చూడగానే జపాన్ భాషలో మాట్లాడాలని అనిపించింది. ఏవైనా తప్పులుంటే మన్నించండి. జపాన్ లో పర్యటించడం నాకు ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఎన్నో చెప్పాలనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సహృదయులైన ప్రజల ముంగిట నేను నిల్చుని ఉన్నాను. అందుకు ఎంతో సంతోషిస్తున్నాను" అంటూ తన మనోభావాలను వెల్లడించారు. 

ఎన్టీఆర్ గతంలో నటించిన అనేక చిత్రాలు జపాన్ లో విడుదలై ప్రజాదరణ పొందాయి. దాంతో ఆయనకు ఇక్కడ కూడా ఫ్యాన్ బేస్ ఉంది. ఆర్ఆర్ఆర్ చిత్రంతో మరోసారి జపాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 

ఎన్టీఆర్ అండ్ టీమ్ బస చేసిన హోటల్ ముందు అభిమానులు భారీగా గుమికూడారు. వారిలో ఓ మహిళా అభిమాని ఎన్టీఆర్ ను చూడగానే భావోద్వేగాలకు గురై కన్నీళ్లు పెట్టుకుంది. కాగా, ఎన్టీఆర్ హోటల్ లాబీలో జపనీస్ అభిమానులకు ఓపిగ్గా ఆటోగ్రాఫ్ లు ఇచ్చి వారిని సంతోషంలో ముంచెత్తారు.

More Telugu News