Doctor: పెళ్లయి కొన్ని నెలలే... విగతజీవులుగా హైదరాబాదీ డాక్టర్ దంపతులు

Hyderabad doctor couple found dead in their house
  • భర్త డాక్టర్, భార్య వైద్య విద్యార్థిని
  • బాత్రూంలో మృతదేహాలు
  • గీజర్ షాక్ కొట్టి ఉంటుందని అనుమానం
హైదరాబాదులో విషాద ఘటన చోటుచేసుకుంది. కొన్నినెలల కిందటే పెళ్లి చేసుకున్న డాక్టర్ దంపతులు తమ నివాసంలోనే విగతజీవులుగా కనిపించారు. వారి మృతదేహాలను బాత్రూంలో కనుగొన్నారు. వేడినీళ్ల గీజర్ షాక్ కొట్టడంతో వారు ప్రాణాలు విడిచి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనతో నగరంలోని ఖాదర్ బాగ్ ఏరియాలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

డాక్టర్ సయ్యద్ నిసారుద్దీన్ (26), వైద్య విద్యార్థిని ఉమ్మీ మొహిమీన్ సైమా (22) భార్యాభర్తలు. నిసారుద్దీన్ సూర్యాపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. సైమా వైద్య విద్య మూడో సంవత్సరం అభ్యసిస్తున్నారు. వీరిరువురు బుధవారం రాత్రి సూర్యాపేట నుంచి హైదరాబాద్ తిరిగొచ్చారు. 

అయితే, ఫోన్ చేస్తే ఎంతకీ సమాధానం రాకపోవడంతో, సైమా తండ్రి వెళ్లిచూడగా, నిసారుద్దీన్, సైమాల మృతదేహాలు బాత్రూం వద్ద పడి ఉన్నాయి. కరెంట్ షాక్ కు గురైన భార్యను కాపాడేందుకు వెళ్లి నిసారుద్దీన్ కూడా చనిపోయి ఉంటాడని సైమా తండ్రి తీవ్ర ఆవేదనతో చెప్పారు. 

ఈ ఘటనపై స్పందించిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Doctor
Couple
Dead
Geyser
Hyderabad
Police

More Telugu News