Sitrang: ఏపీపై 'సిత్రంగ్' తుపాను ప్రభావం లేనట్టే!

Cyclone Sitrang unlikely effects on AP
  • బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం
  • మరింత బలపడి తుపానుగా మారే అవకాశం
  • ఒడిశా, బెంగాల్ తీరాలవైపు పయనిస్తుందని అంచనా
  • ఏపీలో మోస్తరు వర్షాలు పడతాయన్న అధికారులు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, ఇది ఈ నెల 23, 24 తేదీల నాటికి మరింత బలపడి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించడం తెలిసిందే. తుపానుగా మారితే దీన్ని 'సిత్రంగ్' అని పిలవనున్నారు. 

అయితే, దీని ప్రభావం ఏపీ తీర ప్రాంతంపై ఉండబోదని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపానుగా మారిన తర్వాత ఇది పశ్చిమ వాయవ్య దిశగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. 

ఏపీలో గత రెండు వారాలుగా వర్షాలు కురుస్తున్నందున ఇక్కడ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయని, అదే సమయంలో పశ్చిమ బెంగాల్ లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో, తుపాను ఆ రాష్ట్రం దిశగా వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. 

ఒకవేళ అనుకోని పరిస్థితులు సంభవిస్తే తప్ప 'సిత్రంగ్' తుపాను దిశ మార్చుకునే అవకాశాలు చాలా తక్కువ అని పేర్కొన్నారు. 'సిత్రంగ్' ప్రభావంతో ఏపీలో ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపారు.
Sitrang
Cyclone
AP
Weather

More Telugu News