Ola: ఓలా తెచ్చే చౌక స్కూటర్.. పెట్రోల్ బండ్లకు పోటీనిస్తుందా?
- రూ.80వేల ధరలో ఆవిష్కరణకు ఓలా సన్నాహాలు
- డిజైన్ లో భారీ మార్పులు ఉండొచ్చన్న అంచనాలు
- పెట్రోల్ స్కూటర్లకు పోటీనిచ్చే యోచన
- కస్టమర్ల మనసు గెలుస్తుందా? అన్నది చూడాల్సిందే
ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఎస్ 1 ప్రో, ఎస్ 1 పేరుతో రెండు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.1.4, రూ.1 లక్ష వరకు ఉన్నాయి. కొత్తగా రూ.80వేల ధరకు ఓ స్కూటర్ ను దీపావళికి లాంచ్ చేయనున్నట్టు ఓలా ఫౌండర్ భవీష్ అగర్వాల్ పరోక్ష సంకేతమిచ్చారు. దీంతో వినియోగదారుల్లో ఓలా పట్ల మరోసారి ఆసక్తి ఏర్పడింది.
నిజానికి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అత్యాధునికమైనవి. కానీ, దేశీయ మార్కెట్లో అవి అనుకున్న మేర సక్సెస్ కాలేదు. తమిళనాడులో భారీ ఎలక్ట్రిక్ వాహనాల ప్లాంట్ ను ఓలా ఏర్పాటు చేసింది. విక్రయాలు తగ్గడంతో తయారీని కూడా సంస్థ తగ్గించుకోవాల్సి వచ్చింది. తొలుత ఓలా ఎస్ 1 ప్రో, ఎస్1 మోడళ్లను విడుదల చేసినప్పటికీ.. కేవలం ఎస్1 ప్రో విక్రయాలనే చేపట్టింది. క్రమంగా వినియోగదారుల ఆదరణ తగ్గడంతో ఇటీవలే ఎస్1 విక్రయాలను రూ.10వేలు తగ్గించి రూ.లక్షకు తీసుకొచ్చింది. అయినా, అనుకున్నంత మేర బుకింగ్ లు రాలేదు. దీంతో చౌక స్కూటర్ తో అయినా ట్రెండ్ సెట్టర్ కావాలన్నది ఓలా యోచనగా తెలుస్తోంది.
మన దేశంలో ఇప్పటికీ ద్విచక్ర వాహన విక్రయాల్లో 95 శాతం మేర పెట్రోల్ తో నడిచేవి ఉంటున్నాయి. ఎలక్ట్రిక్ కు మారేందుకు కస్టమర్లు సుముఖంగానే ఉన్నా, గత వేసవిలో అధిక ఉష్ణోగ్రతలకు ఓలా సహా పలు కంపెనీల ఈవీలు పేలిపోవడంతో కస్టమర్లలో అభద్రతా భావం నెలకొంది. ఈ తరుణంలో తక్కువ ధరతో పోటీ సంస్థలతో పాటు, పెట్రోల్ స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వొచ్చని, కస్టమర్లకు చేరువ కావచ్చని ఓలా భావిస్తోంది.
ఈ చౌక ఓలా స్కూటర్ డిజైన్ లో పెద్ద ఎత్తున మార్పులు ఉంటాయని మార్కెట్ అంచనా వేస్తోంది. ఓలా ఎస్1, ఎస్1 ప్రో మోడల్స్ లో మాదిరే మూవ్ ఓఎస్ సాఫ్ట్ వేర్ ఆధారంగా కొత్త చౌక స్కూటర్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఓలా ఎస్1, ఎస్1 ప్రో రేంజ్ 120-180 కిలోమీటర్ల వరకు ఉంటే, కొత్త స్కూటర్ రేంజ్ ఇంకా తక్కువే ఉండొచ్చు.