Justice DY Chandrachud: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ నియామకం... నవంబర్ 9న బాధ్యతల స్వీకారం

Justice DY Chandrachud appointed as the next cji

  • భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ ఎంపిక
  • జస్టిస్ లలిత్ సిఫారసులకు ఆమోదం తెలిపిన కేంద్రం
  • రెండేళ్ల పాటు సీజేఐగా కొనసాగనున్న జస్టిస్ చంద్రచూడ్

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు సోమవారం ఓ ప్రకటన చేశారు. భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ డీవై చంద్రచూడ్ కు ఆయన అభినందనలు తెలిపారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ చంద్రచూడ్... ప్రస్తుత సీజేఐ జస్టిస్ లలిత్ తర్వాత సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా ఉన్నారు. నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్న జస్టిస్ లలిత్ ను తదుపరి సీజేఐని సూచించాలంటూ ఇటీవలే కేంద్రం కోరిన సంగతి తెలిసిందే.

సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా ఉన్న వారినే సీజేఐగా ఎంపిక చేస్తున్న సంప్రదాయానికి అనుగుణంగా జస్టిస్ చంద్రచూడ్ పేరును జస్టిస్ లలిత్ సిఫారసు చేశారు. జస్టిస్ లలిత్ సిఫారసులకు సోమవారం కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇదే విషయాన్ని న్యాయ శాఖ మంత్రి హోదాలో కిరణ్ రిజిజు ప్రకటించారు. నవంబర్ 8న జస్టిస్ లలిత్ సీజేఐగా పదవీ విరమణ చేయనుండగా... ఆ మరునాడే అంటే... నవంబర్ 9న భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పదవిలో జస్టిస్ చంద్రచూడ్ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.

Justice DY Chandrachud
CJI
Chief Justice of India
Supreme Court
Kiren Rijiju

More Telugu News