Vallabhaneni Vamsi: జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకుని వదిలేశారు.. వైసీపీ తరపునే పోటీ చేస్తా: వల్లభనేని వంశీ
- గన్నవరం విమానాశ్రయంకు ఎన్టీఆర్ పేరును చంద్రబాబు ఎందుకు పెట్టలేదన్న వంశీ
- చంద్రబాబు ప్రమాణస్వీకారం సమయంలో తారక్ ను స్టేజ్ పైకి కూడా పిలవలేదని విమర్శ
- విజయవాడ ఎంపీగా పోటీ చేస్తాననే వార్తలు అబద్ధమని వెల్లడి
14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రశ్నించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు మార్చడంపై ఆలోచించాలని ముఖ్యమంత్రి జగన్ ను తాను కోరానని చెప్పారు. ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ గొప్ప నాయకులని అన్నారు.
అమరావతితో ఎన్టీఆర్ కు సంబంధం లేదని... అమరావతి రైతులకు మద్దతుగా రావడం లేదని ఆయనను విమర్శించడం సరికాదని... ఆయన సినిమాలేవో ఆయన చేసుకుంటున్నారని వంశీ చెప్పారు. 2019 ఎన్నికల్లో ఎన్టీఆర్ ను కరివేపాకుగా వాడుకుని వదిలేశారని... 2014 ప్రమాణస్వీకారం సమయంలో పట్టించుకోలేదని, కనీసం తారక్ కు ఒక బ్యానర్ కూడా కట్టలేదని అన్నారు. జనాల మధ్యలో కూర్చోబెట్టారని విమర్శించారు. ఇప్పుడు అవసరం వచ్చిందని రమ్మంటే ఆయన ఎలా వస్తారని ప్రశ్నించారు.