Rajendra Prasad: ఒక వైపున మిత్రుడి మరణం .. మరో వైపున కరోనా భయం: 'అనుకోని ప్రయాణం' ట్రైలర్ రిలీజ్

Anukoni Prayanam trailer released

  • రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో 'అనుకోని ప్రయాణం'
  • కరోనా నేపథ్యం చుట్టూ అల్లుకున్న కథ 
  • ఇద్దరు స్నేహితుల జీవితాలకు అద్దం పట్టే కథ
  • ఈ నెల 28వ తేదీన సినిమా విడుదల

కరోనా ఎంతమంది జీవితాలను అతలాకుతలం చేసిందనే విషయాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఇప్పటికీ ఈ పేరు వినగానే వెన్నులో వణుకుపుడుతూనే ఉంటుంది. అలాంటి ఒక నేపథ్యంలో తెలుగులో రెండు మూడు సినిమాలు వచ్చాయి కూడా. అయితే అవి కరోనా వైరస్ కి సంబంధించినవి. కానీ తాజాగా రూపొందిన 'అనుకోని ప్రయాణం' అందుకు పూర్తి భిన్నమైనది. 

ఈ సినిమాను జగన్మోహన్ రెడ్డి నిర్మించగా .. వెంకటేశ్ పెదరెడ్ల దర్శకత్వం వహించాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇద్దరు స్నేహితులు భువనేశ్వర్ లో బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన పనులు చేస్తూ తమ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. కరోనా సమయంలో పనులు నిలిచిపోతాయి. అదే సమయంలో ఒక స్నేహితుడు చనిపోతాడు. తన మృతదేహాన్ని తన సొంత ఊరు రాజమండ్రికి తీసుకెళ్లమనేది అతని చివరి కోరిక. 

దేశమంతా లాక్ డౌన్ నడుస్తుండగా ఆ శవాన్ని తీసుకుని బయల్దేరిన స్నేహితుడు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనేదే కథ. రాజేంద్ర ప్రసాద్ .. నరసింహ రాజు .. నారాయణరావు .. రవిబాబు .. ప్రేమ .. తులసి .. ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News