Mexico: మెక్సికో బార్‌లో దుండగుల కాల్పులు.. 12 మంది మృత్యువాత
- అశాంతికి చిరునామాగా మారుతున్న మెక్సికో
- డ్రగ్స్ ముఠాల మధ్య ఆధిపత్య పోరు
- నిందితుల కోసం గాలిస్తున్న భద్రతా దళాలు
మెక్సికోలోని ఓ బార్‌లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 12 మంది మృత్యువాత పడ్డారు. మరికొందరు గాయపడ్డారు. ఇరపూటో నగరంలో నిన్న జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. గువానాజువాటో రాష్ట్రంలో నెల రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన కావడం గమనార్హం. ప్రపంచంలోనే అగ్రశ్రేణి కార్ల ఉత్పత్తికి ఈ రాష్ట్రం చిరునామా. అలాంటి చోట తరచూ జరుగుతున్న కాల్పుల ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. డ్రగ్స్ ముఠాలు తరచూ ఇక్కడ ఇలాంటి గొడవలు పడుతూ అశాంతిని రేకెత్తిస్తున్నాయి.
తాజాగా ఓ బార్‌లోకి చొరబడిన దుండగులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆరుగురు పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులకు గల కారణం తెలియరాలేదు. నిందితుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గత నెల మొదటి వారంలో ఇదే రాష్ట్రంలోని టరిమోరోలో జరిగిన కాల్పుల్లో పదిమంది మరణించారు. అలాగే, ఈ నెల 6న గుయెర్రెరో రాష్ట్రంలోని సిటీహాల్‌లో జరిగిన కాల్పుల ఘటనలో మేయర్ సహా 12 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.