Telangana: మునుగోడులో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ... టీఆర్ఎస్ గూటికి చేరిన పల్లె రవి దంపతులు
- జర్నలిస్టుగా వృత్తి జీవితం ప్రారంభించిన పల్లె రవి
- మునుగోడు కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగిన వైనం
- చండూరు ఎంపీపీగా కొనసాగుతున్న రవి భార్య కల్యాణి
- ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ ఆశించిన రవి
- కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న వైనం
మునుగోడు ఉప ఎన్నికల్లో దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలకు ఎదురు దెబ్బలు తప్పడం లేదు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్‌కు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాజీనామా ద్వారా భారీ షాక్ తగలగా... తాజాగా కాంగ్రెస్ పార్టీకి కూడా మునుగోడులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మునుగోడు నియోజకవర్గ కేంద్రం చండూరు మండల పరిషత్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్న కల్యాణి తన భర్త పల్లె రవి కుమార్‌తో కలిసి టీఆర్ఎస్ గూటికి చేరారు.
పూర్వాశ్రమంలో జర్నలిస్టుగా పనిచేసిన పల్లె రవికుమార్ ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. మునుగోడులో కీలక నేతల్లో ఒకరిగా ఎదిగారు. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను ఆయన ఆశించారు. పార్టీ అధిష్ఠానం కూడా ఆయన పేరును పరిశీలించింది. అయితే సర్వేలో ఆయన వెనుకబడటంతో టికెట్ దక్కలేదు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలు నెరపిన మంత్రాంగంతో ఆయన ఎంపీపీగా ఉన్న తన భార్యతో కలిసి కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరారు. పల్లె రవి దంపతులను మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు.