Shashi Tharoor: అశోక్ గెహ్లాట్ పై చర్యలు తీసుకోవాలి: శశిథరూర్
- కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఖర్గే, థరూర్
- ఖర్గేకు మద్దతుగా ట్విట్టర్ లో వీడియో ఉంచిన గెహ్లాట్
- అసంతృప్తిని వ్యక్తం చేసిన శశి థరూర్
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక గెహ్లాట్ పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం శశిథరూర్, మల్లికార్జున ఖర్గే పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఖర్గేకు అనుకూలంగా ట్విట్టర్ లో కోహ్లీ ఓ వీడియో సందేశాన్ని ఉంచారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో ఖర్గే మంచి సంబంధాలను కలిగి ఉన్నారని వీడియోలో గెహ్లాట్ అన్నారు. ప్రతిపక్ష నేతలతో కూడా చర్చించగలిగే సామర్థ్యం ఖర్గేకు ఉందని చెప్పారు. కాబట్టి ఆయనను మనందరం గెలిపించాలని అన్నారు.
ఈ నేపథ్యంలో శశిథరూర్ మాట్లాడుతూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని... పార్టీ ఆఫీస్ బేరర్లు కానీ, ముఖ్యమంత్రులు కానీ, పీసీసీ చీఫ్ లు కానీ ఏ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొనడం కానీ, మద్దతును ప్రకటించడం కానీ చేయకూడదని అన్నారు. కానీ ఖర్గేకు అశోక్ గెహ్లాట్ బహిరంగంగా మద్దతును తెలిపారని... దీనిపై కాంగ్రెస్ ఎన్నికల అధికార యంత్రాంగం దర్యాప్తు చేయాలని కోరారు. గెహ్లాట్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు.