Team India: బుమ్రా స్థానంలో షమీ!... అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ!
![bcci officially announces Mohammed Shami in the place of Jasprit Bumrah in t20 world cup squad](https://imgd.ap7am.com/thumbnail/cr-20221014tn634945eb5ff59.jpg)
- బుమ్రా స్థానంలో షమీని అధికారికంగా ఎంపిక చేసిన బీసీసీఐ
- ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న షమీ
- రిజర్వ్ బెంచ్‌లో కొత్తగా సిరాజ్, శార్దూల్‌లకు చోటు
- మార్పుల తర్వాత తుది జట్టును ప్రకటించిన బీసీసీఐ
త్వరలో ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టులో మహ్మద్ షమీకి చోటు దక్కింది. గాయంతో మెగా టోర్నీకి దూరమైన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో మహ్మద్ షమీని జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ఇదివరకే భారత జట్టు ఆస్ట్రేలియా చేరుకోగా... శుక్రవారం షమీ కూడా ఆస్ట్రేలియా చేరుకున్నాడని, ప్రస్తుతం బ్రిస్‌బేన్ లోని భారత జట్టుతో అతడు జత కలుస్తాడని బీసీసీఐ తన ప్రకటనలో వెల్లడించింది.
టీ20 వరల్డ్ కప్‌కు ఇదివరకు బీసీసీఐ ప్రకటించిన జట్టులో రిజర్వ్ బెంచ్‌లో షమీ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా బుమ్రా స్థానంలో అతడు తుది జట్టులోకి ఎంపిక కాగా... మరో ఇద్దరు బౌలర్లు మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌లను బీసీసీఐ రిజర్వ్ బెంచ్‌లోకి ఎంపిక చేసింది. వీరిద్దరూ త్వరలోనే ఆస్ట్రేలియా బయలుదేరతారని బీసీసీఐ వెల్లడించింది.
తాజాగా మార్పులు చేర్పుల తర్వాత టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత తుది జట్టును కూడా బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హూడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీలు తుది జట్టులో ఉన్నారు.