Nayanthara: నయనతారకు మరో షాక్... సరోగసీపై విచారణ కమిటీని ఏర్పాటు చేసిన తమిళనాడు
![tamilnadu constitutes a committe on nayanthara surrogacy issue](https://imgd.ap7am.com/thumbnail/cr-20221013tn6347d4bfd8e9d.jpg)
- ఇటీవలే దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను పెళ్లి చేసుకున్న నయన్
- కవల పిల్లలు పుట్టారంటూ నయన్ దంపతుల పోస్టులు
- సరోగసీ ద్వారా నయన్ బిడ్డలకు జన్మనిచ్చిందంటూ విమర్శలు
- ఈ వివాదంపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన తమిళనాడు
ప్రముఖ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ దంపతులకు తమిళనాడు సర్కారు గురువారం షాకిచ్చింది. నయన్, విఘ్నేశ్ దంపతులు ఇటీవలే కవలలకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి జరిగి 4 నెలలు కూడా కాకుండానే నయన్ కవల పిల్లలకు ఎలా జన్మనిచ్చారన్న వాదనలు రేకెత్తగా... సరోగసీ (అద్దె గర్భం) ద్వారా నయన్ దంపతులు పిల్లలను కన్నారన్న వాదనలు వినిపించాయి.
అయితే సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రచ్చ నేపథ్యంలో తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ స్పందించారు. ఈ విషయంపై నయన్ దంపతులు వివరణ ఇవ్వాల్సి ఉందని ఆయన అన్నారు. అంతేకాదు, తమిళనాడు సర్కారు తాజాగా నయన్ సరోగసీ వివాదంపై ఏకంగా విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. నయన్ సరోగసీపై సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు సరోగసీ విధానం ద్వారా పిల్లలను కనడంపై నిషేధాన్ని విధించింది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే సరోగసీకి వెళ్లేందుకు చట్టం అనుమతిస్తుంది.