YSRCP: పెంపుడు కుక్క చనిపోయిన మరునాడే దాన్ని కొంటామంటూ ఆరుగురు వచ్చారు: సీబీఐకి దస్తగిరి ఫిర్యాదు
![approver in ys vivekananda rfeddy case dastagiri complaint to cbi over his security](https://imgd.ap7am.com/thumbnail/cr-20221012tn6346c00d16e25.jpg)
- సోమవారం జిల్లా ఎస్పీని కలిసిన దస్తగిరి
- తాజాగా సీబీఐ అధికారులను ఆశ్రయించిన వైనం
- వరుస పరిణామాలతో తనకు ముప్పు ఉందని ఆందోళన
- తగినంత భద్రత కల్పించాలని వేడుకోలు
వైసీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి వరుసగా బుధవారం మరోమారు కడపకు వచ్చాడు. తన సొంతూరు పులివెందుల నుంచి సోమవారం కడపకు వచ్చిన దస్తగిరి తనకు కల్పిస్తున్న భద్రత సరిగా లేదంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం కడపకు వచ్చిన అతడు... నేరుగా సీబీఐ అధికారుల వద్దకు వెళ్లాడు. తన భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేసిన దస్తగిరి... వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే తన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పాడు.
వారం రోజుల క్రితం తన పెంపుడు కుక్క చనిపోయిందని చెప్పిన దస్తగిరి... కుక్క చనిపోయిన మరునాడే ఆ కుక్కను కొనుగోలు చేస్తామంటూ ఆరుగురు వ్యక్తులు తన ఇంటికి వచ్చినట్లుగా చెప్పాడు. తాజాగా రెండు రోజుల క్రితం తనకు కేటాయించిన గన్మన్లను పోలీసులు ఉన్నపళంగా మార్చేశారని తెలిపాడు. ఈ విషయంపై తనకు ఎలాంటి ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదని అతడు వాపోయాడు. ఇవన్నీ చూస్తుంటే తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న దస్తగిరి... తనకు తగినంత భద్రత కల్పించాలని సీబీఐ అధికారులను కోరాడు.