Telangana: కేసీఆర్‌కు ఆ అర్హత లేదు: సోము వీర్రాజు
- టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్
- జాతీయ పార్టీని స్తాపించే అర్హత కేసీఆర్‌కు లేదన్న వీర్రాజు
- ఆంధ్రాలో అడుగుపెట్టే అర్హత కూడా కేసీఆర్‌కు లేదని వెల్లడి
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్‌ను జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశపెడుతూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటుగా స్పందించారు. టీఆర్ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తూ కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై తాజాగా శనివారం స్పందించిన వీర్రాజు... జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీని ప్రారంభించే అర్హత కేసీఆర్‌కు లేదని అన్నారు.
ఆంధ్రులను ద్రోహులుగా అభివర్ణించిన కేసీఆర్‌కు ఏపీలో అడుగుపెట్టే అర్హత కూడా లేదని వీర్రాజు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, వీఆర్ఎస్ తీసుకోక తప్పదని ఆయన అన్నారు. కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో చిక్కుకున్నారని వీర్రాజు ఆరోపించారు.