Andhra Pradesh: ఈడీ అధికారులు గొప్పవాళ్లు... వారి గురించి ఎలా అంటే అలా మాట్లాడకూడదు: జేసీ ప్రభాకర్ రెడ్డి
- వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో ఈడీ విచారణకు హాజరైన జేసీ
- జేసీని 5 గంటల పాటు విచారించిన ఈడీ
- ఈడీ అధికారులు తనను గౌరవంగా చూసుకున్నారన్న జేసీ
- ఈడీ వద్ద మనల్ని మనం నిరూపించుకునే అవకాశం ఉందని వెల్లడి
- జగన్ పేరును ప్రస్తావించకుండానే సెటైర్లు గుప్పించిన టీడీపీ నేత
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించారన్న కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు విచారణకు వచ్చిన టీడీపీ సీనియర్ నేత, అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి... ఈడీ అధికారుల తీరుపై ప్రశంసలు కురిపించారు. ఈడీ నోటీసుల మేరకు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చిన ప్రభాకర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. దాదాపుగా 5 గంటల పాటు విచారణ సాగగా... ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ప్రభాకర్ రెడ్డి అక్కడే మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఈడీ అధికారులు గొప్ప వాళ్లన్న జేసీ... ఈడీ అధికారులు చిన్నవాళ్లేమీ కాదన్నారు. ఈడీ అధికారుల గురించి ఎలా అంటే అలా మాట్లాడరాదని కూడా ఆయన కితాబిచ్చారు. తన పట్ల ఈడీ అధికారులు చాల గౌరవంగా వ్యవహరించారన్నారు. ఈడీ అధికారుల గురించి బయట జరుగుతున్న ప్రచారం అంతా తప్పేనన్నారు. ఈడీ లాంటి దర్యాప్తు సంస్థ వద్ద మనల్ని మనం నిరూపించుకునే అవకాశం ఉందన్నారు. తనపై నమోదైన కేసులో ఈడీ అధికారుల వద్ద ఇప్పటికే అన్ని ఆధారాలు ఉన్నాయన్న జేసీ... వాటిలో తన తప్పేం లేదని తాను నిరూపించుకుంటానని.. ఈ విషయంలో తనకు నమ్మకం ఉందని కూడా వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించకుండానే ఆయనపై ప్రభాకర్ రెడ్డి సెటైర్లు సంధించారు. మీరు జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి అన్న జేసీ.. తాను ఇప్పటిదాకా జైలుకే వెళ్లలేదని తెలిపారు. మా రాజ్యంలో అధికారంలో ఉన్న వారు అనుకున్నది ఏమైనా జరుగుతుందని, అయినా తననేమీ చేయలేకపోయారని అన్నారు. మీ లాగా తన వద్ద వేల కోట్లేమీ లేవని ఆయన అన్నారు. 16 ఏళ్లుగా సాగుతున్న మీ కేసుల సంగతేమైందని కూడా జేసీ ప్రశ్నించారు. అయినా తనపై నమోదైన కేసులో వాహనాలను కొన్నది తానైతే... వాహనాలను అమ్మినవారిని విచారణకు పిలవరా? అంటూ జేసీ ప్రశ్నించారు.