Durga Puja: అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా విషాదం.. నదిలో కొట్టుకుపోయి 8 మంది మృతి: వీడియో ఇదిగో!
- పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురిలో ఘటన
- అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా పోటెత్తిన వరద
- 50 మందిని రక్షించిన సహాయక బృందాలు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
విజయ దశమి రోజున పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురిలో పెను విషాదం చోటుచేసుకుంది. అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తూ 8 మంది జలసమాధి అయ్యారు. నవరాత్రుల అనంతరం దుర్గాదేవిని నిన్న స్థానిక మాల్ నదిలో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నదీ ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో నిమజ్జనానికి వచ్చిన వారిలో చాలామంది కొట్టుకుపోయారు. వీరిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందిని పోలీసులు రక్షించారు. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిన్న రాత్రి 8.30 గంటల సమయంలో ఈ ఘటన జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.
నిమజ్జనం సందర్భంగా వందలాదిమంది ప్రజలు నది ఒడ్డుకు చేరుకున్నారు. నది మధ్యలో నిమజ్జనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వరద పోటెత్తిందని జిల్లా కలెక్టర్ మౌమిత గొడర బసు తెలిపారు. సిక్కిం వంటి ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించినట్టు తెలిపారు. కాగా, అందరూ చూస్తుంగానే నదిలో యువకులు కొట్టుకుపోతున్నా ఎవరూ ఏమీ చేయలేకపోయారు. యువకులు నదిలో కొట్టుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.