Tirumala: తిరుమలలో ముగిసిన వాహన సేవలు... అశ్వ వాహన సేవకు హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ
![justice n v ramana attends tirumala bramhostavam](https://imgd.ap7am.com/thumbnail/cr-20221004tn633c53b3c1006.jpg)
- మంగళవారం అశ్వవాహనంపై ఊరేగిన శ్రీవారు
- అశ్వ వాహన సేవతో వాహన సేవలకు ముగింపు
- రేపు ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల గిరులలో స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో కీలకమైన వాహన సేవలు మంగళవారం రాత్రితో ముగిశాయి. మంగళవారం అశ్వ వాహనంపై తిరు మాఢవీధుల్లో శ్రీవారు విహరించారు. స్వామి వారి అశ్వవాహన సేవలో భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. అశ్వవాహన సేవతో స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు ముగుస్తున్న సంగతి తెలిసిందే.
రేపు ఉదయం 6 గంటలకు శ్రీవారి పుష్కరిణిలో వెంకన్నకు చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి స్వామి వారికి తిరుచ్చి ఉత్సవం జరపనున్నారు. తదనంతరం శాస్త్రోక్తంగా ధ్వజావరోహణాన్ని టీటీడీ నిర్వహించనుంది. ధ్వజావరోహణంతో స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.