Komatireddy Raj Gopal Reddy: మునుగోడులో ఓటు ఎవరికి వేయాలి?: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర పోస్ట్!
![komatireddy venkat reddy interesting post on munugode bypoll in social media](https://imgd.ap7am.com/thumbnail/cr-20221004tn633bf1bbd83fe.jpg)
- కాంగ్రెస్‌తో పాటు మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి
- బీజేపీలో చేరి కమలం గుర్తుపై మునుగోడు ఉప ఎన్నికల్లో దిగనున్న వైనం
- ఏ పార్టీకి ఓటేయాలంటూ మునుగోడు ప్రజలకు ప్రశ్నను సంధించిన మాజీ ఎమ్మెల్యే
- నిబంధనలు పాటిస్తున్న పార్టీ బీజేపీనేనన్న కోమటిరెడ్డి
కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ టికెట్ ద్వారా దక్కిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికను అనివార్యం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కాంగ్రెస్‌ను వీడిన వెంటనే బీజేపీలో చేరిన ఆయన మునుగోడు ఉప ఎన్నికలో కమలం గుర్తుపై పోటీకి సిద్ధమైపోయారు. ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు ఇటు కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతుండగా... ఆ రెండు పార్టీలను మట్టి కరిపించి మునుగోడులో తన సత్తా చాటేందుకు కోమటిరెడ్డి మరింత పదునైన వ్యూహాలతో సాగుతున్నారు. ఇలాంటి క్రమంలో మంగళవారం సోషల్ మీడియా వేదికగా కోమటిరెడ్డి ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ను పెట్టారు.
మునుగోడులో ఓటు ఎవరికి వేయాలి? అంటూ ప్రశ్నించిన రాజగోపాల్ రెడ్డి... ఆ ప్రశ్నకు 3 ప్రత్యామ్నాయాలను సూచించారు. పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో కొన్నట్టు కొన్న టీఆర్ఎస్ కా?... ప్రజలు గెలిపించినా అధికారం కోసం గోడలు దూకే నాయకులు ఉన్న కాంగ్రెస్ కా?... అని ఆయన తొలి రెండు ప్రత్యామ్నాయాలను పేర్కొన్నారు. ఇక చివరగా పార్టీ మారాలంటే రాజీనామా చేయాలన్న సిద్దాంతానికి కట్టుబడి ఉండే బీజేపీకా? అని ఆయన తాను కొత్తగా చేరిన పార్టీకే ఓటేయాలన్న అర్థం వచ్చేలా ఆసక్తికర పోస్ట్‌ను పెట్టారు.