KA Paul: సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా ఆమరణ నిరాహార దీక్షకు దిగిన కేఏ పాల్

KA Paul starts indefinite hunger strike

  • అక్టోబరు 2న ర్యాలీ నిర్వహించ తలపెట్టిన కేఏ పాల్
  • తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఆగ్రహం
  • కేసీఆర్ దుర్మార్గుడు అంటూ వ్యాఖ్యలు
  • ఈయన రాష్ట్రానికి పిత అట అంటూ వ్యంగ్యం

తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అక్టోబరు 2న తాము నిర్వహించ తలపెట్టిన ప్రపంచ శాంతి ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  

కేసీఆర్ వంటి దుర్మార్గమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదని, తమ గ్లోబల్ పీస్ ర్యాలీకి అనుమతించకపోవడం దారుణమని విమర్శించారు. తాము చేపట్టిన ర్యాలీకి అనుమతి ఇచ్చి ఉంటే ప్రముఖులు వచ్చేవారని, తద్వారా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండేదని కేఏ పాల్ వివరించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగానే ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్టు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా, కేసీఆర్ జాతీయ పార్టీ అంశంపైనా కేఏ పాల్ విమర్శలు చేశారు. ఇప్పటిదాకా తెలంగాణను దోచుకున్నాడని, అది సరిపోక దేశాన్ని దోచుకోవడానికి జాతీయ పార్టీ పెడుతున్నాడని అన్నారు. 

పోలీసులు కూడా కేసీఆర్ కు బానిసలుగా మారారని విమర్శించారు. దేశానికి గాంధీజీ జాతిపిత అయితే, ఈయన రాష్ట్రానికి పిత అట! కేసీఆర్ కు సిగ్గుండాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

More Telugu News